మండలి చైర్మన్‌గా ప్రతిభా భారతి లేదా షరీఫ్!

2 Aug, 2015 01:28 IST|Sakshi

పరిశీలిస్తున్న చంద్రబాబు
 
 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ పదవిపై పలువురు టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో.. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రాథమిక కసరత్తు దాదాపు పూర్తిచేసినట్టు సమాచారం. ఈ నెల 31 నుంచి జరిగే శాసనమండలి సమావేశాల్లో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఎ.చక్రపాణి చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ మండలిలో మాత్రం ఆ పార్టీకి తగినసంఖ్యా బలం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికలతో ఆ పార్టీకి మండలిలోనూ మెజారిటీ లభించింది.  దీంతో మండలి చైర్మన్ పదవిపై సీఎం దృష్టి సారించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన కావలి ప్రతిభా భారతి పేరు ఖరారైనట్టు బలంగా ప్రచారం జరుగుతోంది.

అయితే మైనారిటీ నేతకు ఆ పదవి కట్టబెడితే ఎలా ఉంటుందని కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంఏ షరీఫ్ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేరు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే శాసనమండలిలో చీఫ్ విప్‌గా వైవీబీ రాజేంద్రప్రసాద్(కృష్ణా), విప్‌లుగా బీద రవిచంద్ర యాదవ్ (నెల్లూరు), శిల్పా చక్రపాణిరెడ్డి (కర్నూలు)ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే అంగర రామ్మోహనరావు (పశ్చిమ గోదావరి) మండలిలో విప్‌గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు