మెడికల్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు

30 Jun, 2019 02:48 IST|Sakshi

ప్రైవేటులో ఈడబ్ల్యూఎస్‌ కోటా నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

ఒకటో తేదీన మొదటి విడత జాబితా విడుదల... చేరేందుకు ఆరో తేదీ గడువు

మరోవైపు తెలంగాణలో మొదలైన కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌ ర్యాంకుల ఆధారంగా అఖిల భారత స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల ప్రవేశాలకు జరిగే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు చేశారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారమే తొలి విడత సీట్ల కేటాయింపు వివరాల్ని వెల్లడించాల్సి ఉండగా, జూలై ఒకటో తేదీకి మార్చారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లలో అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌)కు రిజర్వేషన్ల అమలు, అలాగే ఆయా కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటాలో కలపాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు చేశారు. పైగా ఈడబ్ల్యూఎస్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలకు 28 వరకూ గడువిచ్చారు. దీంతో 28వ తర్వాతే నేషనల్‌ కోటా సీట్ల లెక్క తెలిసే అవకాశముంది.

ఈ నేపథ్యంలో తొలి విడత సీట్ల కేటాయింపు తేదీని జూలై ఒకటో తేదీకి మార్చాల్సి వచ్చింది. సీట్లు పొందిన విద్యార్థులు ఒకటో తేదీ నుంచి 6వ తేదీ వరకూ సంబంధిత కాలేజీలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో విడత నీట్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వచ్చే నెల 9న ప్రారంభమై 11వ తేదీతో ముగుస్తుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం ఛాయిస్‌ లాకింగ్‌ సౌకర్యం 12వ తేదీ మధ్యాహ్నం 3 తర్వాత అందుబాటులో ఉంటుంది. 13 నుండి 15వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం సీట్ల కేటాయింపు జాబితాను 15వ తేదీన విడుదల చేస్తారు. రెండో విడత కేటాయింపు జాబితా ఆధారంగా ప్రవేశ ప్రక్రియ 15 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తారు.

ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను 23వ తేదీన ఆయా రాష్ట్రాల కోటాకు బదిలీ చేస్తారు. ఈ అఖిల భారత కోటా సీట్ల కోసం రాష్ట్రస్థాయిలో అధికారులు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఈ సీట్లు ఖాళీగా ఉంటే, అటువంటి సీట్ల కోసం మోప్‌–అప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం నుంచి కన్వీనర్‌ కోటా సీట్లకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది.

>
మరిన్ని వార్తలు