గంటల వ్యవధిలోనే పట్టాల మార్పు

27 Jun, 2018 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా రైలు పట్టాలు మారుస్తున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు వీలైనంత తక్కువ అంతరాయం కలిగేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైళ్ల రాకపోకలు తక్కువగా ఉండే వేళల్లో నాలుగైదు గంటలు రాకపోకలు నిలిపి ఆధునిక యంత్రాలతో వేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలిసారి 5 గంటలు రైళ్ల రాకపోకలు నియంత్రించి 4 సెక్షన్ల పరిధిలో పనులు పూర్తి చేశారు.

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని బీనా–కట్నీ రైల్వే సెక్షన్‌లో 5 గంటలు మెగా బ్లాక్‌ నిర్వహించి 2,200 మీటర్ల నిడివి గల మార్గాన్ని బీసీఎం యంత్రాల సాయంతో మరమ్మతు చేశారు. సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్‌ ట్యాపింగ్‌ కూడా నిర్వహించారు. 410 మీటర్ల దూరంలో స్లీపర్లను మార్చడంతోపాటు 2.8 కిలోమీటర్ల మేర కొత్త రైలు పట్టాలు బిగించారు. ఇదే తరహాలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా మెగా బ్లాక్‌కు వేళలు గుర్తించి వేగంగా పనులు పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు