వ్యాట్ మార్పుతో రాష్ట్రానికి రూ.300 కోట్లు

21 May, 2016 04:23 IST|Sakshi
వ్యాట్ మార్పుతో రాష్ట్రానికి రూ.300 కోట్లు

పీడీఎస్ బియ్యంపై పన్నును భరించేందుకు కేంద్రం ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా చట్టం కింద పేదలకు సరఫరా చేస్తున్న బియ్యంపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను ఇక ముందు కేంద్రం భరించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. ఆహార భద్రతా చట్టాన్ని కేంద్రమే నిర్వహిస్తున్నందున.. దాని తరఫున పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంపై వ్యాట్‌ను కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర అధికారులు ఇటీవల కోరారు. దీనిపై కేంద్ర అధికారులతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అధికారులు చర్చలు జరిపారు. ఆహార భద్రత చట్టంలో సెక్షన్ 4.4 కింద ఈ మేరకు వెసులుబాటు ఉందని వివరించారు.

దీంతో పన్ను మొత్తాన్ని భరించేందుకు కేంద్ర అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. తదనుగుణంగా చట్టం చేసుకోవాలని కూడా సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రత కింద ఏటా 18 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నారు. అందులో 13.5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం, 4.5 లక్షల టన్నులు రాష్ట్రం సమకూరుస్తున్నాయి. మొత్తంగా బియ్యం పంపిణీపై రూ.2,200 కోట్ల సబ్సిడీని భరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ క్వింటాలు బియ్యానికి రూ.800 చొప్పున ధర నిర్ణయించి, 5% పన్ను కింద ఏటా సుమారు రూ.120 కోట్లను వాణిజ్య పన్నుల శాఖకు జమ చేస్తోంది.

అయితే ప్రభుత్వంలోనే భాగమైన పౌరసరఫరాల శాఖ తిరిగి వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించడం వల్ల.. రాష్ట్ర నిధులే తిరిగి రాష్ట్రానికి సమకూరుతున్నాయి. మరోవైపు కేంద్రం క్వింటాలు బియ్యానికి అవసరమైన ధాన్యం విలువ ను లెక్కగట్టి రాష్ట్రానికి చెల్లిస్తుంది. ఈ లెక్కన చూస్తే మరింత ఎక్కువగా పన్ను సమకూరుతుంది. తాజాగా వ్యాట్ సొమ్మును భరించేందుకు కేంద్రం సిద్ధమైన నేపథ్యంలో... ఇప్పటివరకూ పౌర సరఫరాల శాఖ చెల్లిస్తున్న రూ.120 కోట్లను కేంద్రమే చెల్లించడంతోపాటు, ఎక్కువగా సమకూరే పన్ను కింద మరో రూ.180 కోట్ల వరకు వస్తాయని రాష్ట్ర అధికారులు అంచనా వేశారు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.300 కోట్ల వరకు అదనంగా ఖజానాకు అందనుంది.

మరిన్ని వార్తలు