ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

24 Jan, 2020 05:20 IST|Sakshi

పాత షెడ్యూలు కంటే ఒకరోజు ముందే ఎంసెట్‌

మే 4, 5, 7, 8 తేదీల్లో ఎంసెట్‌ నిర్వహణ

విద్యార్థుల సంఖ్యను బట్టి 4 రోజులు

లాసెట్, పీజీఈసెట్‌ పరీక్ష తేదీల్లోనూ మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) షెడ్యూలు మారింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్స్‌ కన్వీనర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్‌ను ఈ ఏడాది మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఎంసెట్‌ను (ఇంజనీరింగ్‌) మే 4వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.

4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్‌గా, 7వ తేదీన రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును సవరించారు. 8వ తేదీ కూడా ఎంసెట్‌ నిర్వహణ కోసమే రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటే 8వ తేదీన కూడా ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్‌ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్‌ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్‌ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 27 నుంచి నిర్వహించాల్సిన పీజీ ఈసెట్‌ పరీక్షలను సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఇక ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్ష, ఈసెట్, పీఈ సెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాలు, రంజాన్‌ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వికలాంగులకు ఫీజు రాయితీపై ఆయా సెట్స్‌ కమిటీల సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులను పెంచబోమని స్పష్టం చేశారు.  

ఫేసియల్‌ రికగ్నైషన్‌.. 
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు ఫేషియల్‌ రికగ్నైష న్‌ విధానం అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. దాని ద్వారా పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే విధానాన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమయంలో విద్యార్థుల ముఖం, కళ్లు స్కాన్‌ చేసి, వాటి ఆధారంగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టాలని భావి స్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (టీఎస్‌టీఎస్‌)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

>
మరిన్ని వార్తలు