జావ..చేవ

4 Jan, 2015 04:47 IST|Sakshi
జావ..చేవ

మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు
జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం
మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు
ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల వైపు చూపు
జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం
‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ నినాదంతో ముందుకు

 ఖమ్మం హవేలి: సంప్రదాయ వంటకాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మళ్లీ వాటినే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యం అలనాటి వంటల్లోనే ఉందనే విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించినట్టున్నారు. ‘బ్యాక్ టు నేచర్’ అనే నినాదంతో సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, పెసలు, మినుములు, గోధుమలతో తయారు చేసిన గటక, జావ, దనియా (అన్ని చిరుధాన్యాలు కలిపిన పిండి), మొలకలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

ఉదయం అల్పాహారానికి బదులు జొన్న, రాగి జావకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆహారంతోనే రోజును ప్రారంభిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మార్నింగ్ వాకర్స్, క్రీడాకారులు, జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డర్స్, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు కాస్తంత ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని స్వీకరిస్తున్నారు. నగరంలో ఉదయాన్నే జనసమర్థం ఎక్కువగా ఉండే చోట గటక, జావ విక్రయ స్టాల్స్ వెలుస్తున్నాయి.
 
ఎనీ ఐటెమ్ టెన్ రూపీస్ ఓన్లీ..
ఈ స్టాల్స్‌లో జన్న, రాగి జావతో పాటు వామువాటర్, మొలకలు లభిస్తున్నాయి. ఏ ఐటమ్ అయినా రూ.10కే లభిస్తుండడంతో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జావలో శొంఠి, మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తేనె కలిపి ఇస్తుండటంతో ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి ఉంటుండటంతో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వీటిలో కారం, మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికి ఉపకరిస్తున్నాయి.

ఇక ఇంటి వద్ద రొట్టెలు తయారు చేసుకునే దలియా (చిరుధాన్యల మిశ్రమాల పిండి)కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సర్దార్‌పటేల్ స్టేడియం, భక్తరామదాసు కళాక్షేత్రం, రైతుబజార్, డీఆర్‌డీఏ కూరగాయల మార్కెట్ వద్ద రెండుళ్లుగా ఈ ఆహారపదార్థాల స్టాల్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 11:00 గంటల వరకు వీటి వద్దకు వందల సంఖ్యలో జనం వచ్చి జావ, గటక సేవిస్తున్నారు. కొందరు ఇళ్లకు పార్సిల్స్ తీసుకెళ్తున్నారు. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉండటం కూడా కలిసొస్తోంది.
 
తక్కువ పరిమాణం.. ఎక్కువ శక్తి
చిరుధాన్యాల ఆహారం కావడంతో తక్కువ పరిమాణంలో తీసుకున్నా సరే ఎక్కవ శక్తి లభిస్తోందని వినియోగదారులు అంటున్నారు. షుగర్, మలబద్ధకం జీర్ణసంబంధ వ్యాధుల నియంత్రణ, లావు, బరువు తగ్గటం, రక్తశుద్ధి, రోగ నిరోధకశక్తి పెంపుదలకు ఈ ఆహారపదార్థాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని పలువురి అభిప్రాయం.
 
ఆయా ఆహారపదార్థాలతో ఉపయోగం..
జొన్నల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, జింక్, పొటాష్, పాస్ఫరస్ లాంటి పోషకాలు, థయామిన్, రైబోఫ్లోవిన్, లాంటి ‘బి’ విటమిన్లు లభిస్తాయి. టానిన్లూ, ఫెనోలిక్ ఆమ్లాలు యంథోసియానిన్స్ లాంటి ఫైటోకెమికల్స్ శరీర బరువును తగ్గించడమే కాకుండా శక్తినిస్తాయి. గర్భిణులకు ఇవి మరీ మంచిది.
     
రాగుల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, ‘ఏ’, ‘బి’ విటమిన్స్ లభిస్తాయి. ఫాస్ఫరస్ లాంటి పోషకాలు, పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కాల్షియం ఎముకల్ని దృఢపరుస్తుంది. కీళ్లనొప్పులు, మహిళల్లో మోనోపాజ్ (40ఏళ్లు దాటిన) దశ దాటిన తరువాత  ఆస్టియోపోరోసిస్ రాకుండా ఇవి నియంత్రిస్తాయి. రాగులు మైగ్రెయిన్ ను తగ్గిస్తాయి. బాలింతలకు పాలు పెరిగేందుకు దోహదపడుతాయి.   మహిళల్లో రక్తహీనతను నివారించే ఇనుము పెరుగుతుంది. రాగుల్లో ఉన్న మెగ్నీషియం నెలసరిలో వచ్చే నొప్పులు, అసౌకర్యాన్ని దూరం చేస్తుంది.
     
సజ్జలు, సామలు, బార్లీ, రాజ్‌గీరా ధాన్యాల్లో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ. అవి జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నియంత్రించబడి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. నాడీవ్యవస్థ బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగేలా ఇందులో ఉన్న ‘బి’ విటమిన్ దోహదపడుతుంది.

గుండెజబ్బులు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ వంటికి రాకుండా ఉంటాయి. బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ ఉన్న మహిళలు వారానికి 6 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని న్యూట్రిషన్స్‌సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిరుధాన్యాలను ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేరిస్తే బాగుంటుందని వైద్యుల సలహా.

మరిన్ని వార్తలు