ఆరోగ్యశ్రీ రోగుల నుంచి డబ్బు వసూలు

4 Nov, 2018 01:30 IST|Sakshi

200 మంది నుంచి వసూలు చేసినట్లు విజిలెన్స్‌ విచారణలో బట్టబయలు

ఆస్పత్రుల తీరుపై ఆగ్రహం... చర్యలు తీసుకోవడంలో ఆరోగ్యశ్రీ విఫలం

సాక్షి, హైదరాబాద్‌: అతని పేరు సీహెచ్‌ సంజు... హైదరాబాద్‌కు చెందిన అతని చేతులు, కాళ్లు, నాలుక పక్షవాతానికి గురయ్యాయి. దీంతో అతన్ని గతేడాది జూలై 12న లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతనికి బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. ఆరోగ్యశ్రీ కిందే కేసును రిజిస్టర్‌ చేశారు. కానీ తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయడం సాధ్యంకాదని అతని నుంచి ఏకంగా రూ.6.30 లక్షలు ఒత్తిడి చేసి మరీ వసూలు చేశారు.  

ఆమె పేరు జంగమ్మ... భువనగిరి జిల్లాకు చెందిన ఆమె కిడ్నీలో రాళ్ల సమస్యతో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద రోగిని చేర్చుకున్నారు. అనంతరం ఆమెకు ఆపరేషన్‌ చేసినట్లు వైద్యులు ప్రకటించినా, ఎక్కడా ఆపరేషన్‌ చేసిన గుర్తులు లేవు. దీనిపై నిలదీయగా అప్పటికప్పుడు ఆమెను పిలిపించి బ్లేడ్‌తో పక్కటెముక వద్ద కోసి వెంటనే కుట్లు వేశారు. ఎలాంటి మత్తుమందు కూడా ఇవ్వలేదు. ఫొటోలు తీసుకొని బయటకు పంపించారు. దీనిపై విచారణ చేయగా ఆస్పత్రిదే తప్పని తేలింది. చికిత్స చేయకుండానే వారు ఆరోగ్యశ్రీ కింద సొమ్ము చేసుకున్నారు.  

ఇలా రాష్ట్రంలో అనేక ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ రోగులను మోసం చేస్తూ నుంచి డబ్బులు గుంజుతున్నట్లు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇలా 200 మంది మోస పోయినట్లు విజిలెన్స్‌ నిర్ధారించినట్లు సమాచారం.  

ఆస్పత్రులకు అండగా అధికారులు.. 
200 మంది ఆరోగ్యశ్రీ రోగులను మోసం చేయడం, వారి నుంచి డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే అవకాశమున్నా రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం నేరం. అలాచేస్తే రోగి నుంచి వసూలు చేసిన సొమ్ములో ఐదు రెట్ల వరకు ఆస్పత్రికి జరిమానా విధించాలి. కానీ అనేక కేసుల్లో అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమయ్యారు. కొన్ని కేసుల్లో బాధితులకు వారు చెల్లించిన సొమ్మును ఇప్పించి ఊరుకున్నారు. ఉదాహరణకు బాధితుని నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తే ఆస్పత్రిపై రూ.30 లక్షల జరిమానా విధించాలి. కానీ బా« దితులకు రూ.6 లక్షలు ఇప్పించి, కొందరు అధికారులు 4, 5 లక్షలు పుచ్చుకొని కేసును మూసేశారన్న ఆ రోపణలూ ఉన్నాయి. తాము అడిగినంత ఇవ్వని ఆ స్పత్రు లపై కఠిన చర్యలు తీసుకుని,  ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తూ ఆరోగ్యశ్రీ రోగులను వేధించిన వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  

ఆరోగ్యశ్రీ రోగులపై శీతకన్ను...  
ఇదిలావుంటే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులను చులకనగా చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి కేటాయించే వార్డులు, అందించే వైద్యం విషయంలో నాణ్యతా లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలున్నాయి. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. రోగులనుంచి తీసుకుంటే ఊరుకోవడంలేదు. కాబట్టి అంతకంటే ఎక్కువ సౌకర్యాలు ఏం కల్పించగలం అన్న భావన ఆస్పత్రి వర్గాల్లో నెలకొంది. ఇవన్నీ తెలిసినా ఆరోగ్యశ్రీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సొమ్ము చేసుకునే కేంద్రాలుగా భావిస్తూ లక్షలు గడిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు