4 మినార్లు..5 సంవత్సరాలు

19 Nov, 2019 01:04 IST|Sakshi

ఎట్టకేలకు చార్‌‘మినార్‌’పరిరక్షణ పనులు పూర్తి

దిగువ భాగం పనులు మొదలు

నిధుల విడుదలలో జాప్యమే ఈ ఆలస్యానికి కారణం

మొత్తం పనులకు ఎన్నేళ్లకో..?

"గత మే నెలలో చార్మినార్‌ నైరుతి భాగంలోని మినార్‌ నుంచి భారీ పెచ్చు ఊడింది. దాని మరమ్మతుకుగాను సిబ్బంది ఆ భాగం వద్దకు చేరుకుని, కూర్చుని పని చేయటం కోసం స్కఫోల్డింగ్‌ (ఇనుప రాడ్లు, కర్రలతో ఏర్పాటు చేసే భాగం) ఏర్పాటుకు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. ఇది చార్మినార్‌ పరిరక్షణ నిధుల్లో కోత పడి అసలు పనుల్లో జాప్యానికి కారణమైంది.

రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రతినిధి రానున్నాడని తెలిసి గత నెల దాని చుట్టూ పరిసరాలు, సమీపంలోని ఉప ఆలయాల ముస్తాబు, కొత్త రోడ్డు నిర్మాణం, పచ్చిక బయలు...తదితర పనులు చేశారు. ఇందుకు పట్టిన సమయం కేవలం ఒక నెల. వీటికి ఏఎస్‌ఐ రూ.5 కోట్లను విడుదల చేసింది. యుద్ధప్రాతిపదిక పనులు అంటే ఇవి"

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్‌. ఓ రకంగా చెప్పాలంటే ఈ నగర సంతకం లాంటిది ఆ నిర్మాణం. మరి అది ప్రమాదంలో పడిందంటే పరిరక్షణ చర్యలు యుద్ధప్రాతిపదికన జరగాల్సిందే. కానీ, ఒక్కోటి 48.7 మీటర్ల చొప్పున ఎత్తు ఉండే నాలుగు మినార్ల పరిరక్షణ పనులు పూర్తి చేసేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ‘పంచవర్ష ప్రణాళిక’నే కొనసాగించారు. 2014, డిసెంబర్‌లో ప్రారంభమైన పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు దిగువ భాగానికి పరిరక్షణ పనులు ప్రారంభించారు. మరి ఆ భాగం పనులు పూర్తి చేసేందుకు ఎన్నేళ్లు పడతాయో చూడాలి. చివరి మినార్‌ పని పూర్తయ్యేసరికి, మొదటి మినార్‌ రంగు మారిందంటే, పనుల్లో జాప్యం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. 

"ఒక మినార్‌లో చిన్న పని మినహా దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడే దిగువ భాగం పని ప్రారంభిస్తున్నాం. మొత్తం కట్టడం పని వీలైనంత తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ పనులు క్లిష్టమైనవే అయినందున కాస్త జాప్యం తప్పదు. అయినా వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం."
మిలింద్‌ కుమార్‌ చావ్లే, ఏఎస్‌ఐ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్టు

ఎందుకు జాప్యం..?
427 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్‌ క్రమంగా వాతావరణ ప్రభావం, వాహనాల కాలుష్యంతో దెబ్బ తింటూ వస్తోంది. అంతేకాదు కొందరు పర్యాటకులు కట్టడం గోడలపై లోతుగా పేర్లు చెక్కడం లాంటి పనులతో నిర్మాణం పైపూత దెబ్బతింటోంది. క్రమంగా పగుళ్లు ఏర్పడి వాటిల్లోంచి వాన నీళ్లు, గాలిలోని తేమ లోనికి చొరబడి చార్మినార్‌ను ప్రమాదంలో పడేశాయి. ధవళ వర్ణంతో మెరవాల్సిన గోడలు గోధుమ, పసుపు వర్ణంలోకి మారాయి. జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఐఐటీ కాన్పూర్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ), విస్కాన్నిన్‌ విశ్వవిద్యాలయం నిపుణుల బృందం అధ్యయనం చేసి, వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టకుంటే కట్టడం శిథిలమవడం ఖాయమని తేల్చి నివేదిక అందించారు.

దీంతో 2014లో పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఏఎస్‌ఐ నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది.  కానీ.. ఏఎస్‌ఐ తెలంగాణ విభాగానికి సంవత్సరానికి వచ్చే నిధులు సగటున రూ.2 కోట్లకు అటూఇటుగా ఉంటాయి. దీంతో వాటిల్లోంచి చార్మినార్‌కు ఒక్కో సంవత్సరం కొన్ని లక్షలను మాత్రమే కేటాయిస్తూ వచ్చారు. డంగు సున్నం మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించినందున మళ్లీ అదే మిశ్రమంతో కట్టడం మొత్తం పైపూత వేయటమే ఈ పని. ఏడాదిన్నరలో ఈ పని పూర్తి చేసి, మరో ఏడాదిలో దిగువ భాగాన్ని కూడా సిద్ధం చేయాలని తొలుత భావించారు. కానీ నిధులు సరిపోక, ఆ వచ్చేవి కూడా సకాలంలో విడుదల కాక పనుల్లో ఇంత జాప్యం జరిగింది.

మరిన్ని వార్తలు