ఇక చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘ఎకో’ చుక్‌ చుక్‌

5 Nov, 2019 04:55 IST|Sakshi

పర్యావరణ హితంగా మార్పు

హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ సాంకేతికతతో అనుసంధానం

ప్రమాదరహితమైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

ఏటా రూ.29.3 కోట్లు ఆదా

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానంతో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ జిగేల్‌మంటోంది. తాజాగా హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ టెక్నాలజీతో ఈ ట్రైన్‌ను అనుసంధానం చేశారు.ఇప్పటి వరకు బోగీల్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీ,తదితర సదుపాయాల కోసం డీజిల్‌ జనరేటర్లను వినియోగిస్తుండగా ఇక నుంచి హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ పరిజ్ఞానం (ఇంజన్‌కు సరఫరా అయ్యే విద్యుత్‌ను బోగీలకు విస్తరించడం) వల్ల అన్ని బోగీలకు విద్యుత్‌ సరఫరాను ప్రవేశపెట్టారు. దీంతో డీజిల్‌ జనరేటర్ల అవసరం తప్పింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు గతంలో ఉన్న ఐసీఎఫ్‌ (ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ) బోగీల స్థానంలో అత్యంత సురక్షితమైన ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మెన్‌బుష్‌) బోగీలను ఏర్పాటు చేశారు. దీంతో హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ వినియోగం అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికే కొన్ని రైళ్లలో...
దక్షిణమధ్య రైల్వేలో ఇప్పటి వరకు విక్రమ్‌ సింహపురిఅమరావతి ఎక్స్‌ప్రెస్, తెలంగాణ, జమ్ముతావి హమ్‌సఫర్, డబుల్‌ డెక్కర్, నారాయణాద్రి, సికింద్రాబాద్‌–నాగ్‌పూర్, సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్, సికింద్రాబాద్‌–గుంటూరు, లింగంపల్లి–విజయవాడ ఇంటర్‌సిటీ, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రైళ్లలో హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ ద్వారా విద్యుత్‌ సదుపాయం అందజేస్తున్నారు. ఫలితంగా బోగీలకు డీజిల్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేయాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల ఏటా వినియోగమయ్యే 49.7 లక్షల డీజిల్‌పైన రూ.35 కోట్లను వెచ్చించవలసిన ఖర్చు తప్పింది.

దీనిస్థానంలో విద్యుత్‌ వినియోగం వల్ల కేవలం రూ.5.7 కోట్ల వరకు మాత్రమే ఖర్చవుతుందని, రూ.29.3 కోట్ల మేర డబ్బు ఆదా అవుతుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. మరోవైపు డీజిల్‌ స్థానంలో విద్యుత్‌ను వినియోగించడం వల్ల పర్యావరణ ప్రమాణాలు రెట్టింపైనట్లు పేర్కొన్నారు. మరోవైపు శబ్దకాలుష్యం పోయింది. ఐసీఎఫ్‌ కోచ్‌ల స్థానంలో ప్రవేశపెట్టిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు పూర్తిగా సురక్షితమైనవి. ప్రమాదాల తీవ్రత తక్కువగా ఉంటుంది. రైళ్లు పట్టాలు తప్పినప్పుడు బోగీలు దేనికవే విడిపోతాయి, ఒకదానిపైకి మరొకటి రావు. అలాగే రైళ్లలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆర్పేసే అగ్నిమాపక పరికరాలు ఉంటాయి. దీనివల్ల మంటలు విస్తరించవు. అలా ఈ రైళ్ల వల్ల సురక్షితమైన ప్రయాణంతో పాటు పర్యావరణ ప్రమాణాలూ మెరుగుపడుతాయి.

మరిన్ని వార్తలు