చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ కేసులో కీలక మలుపు

10 Dec, 2019 11:33 IST|Sakshi

దిశ హత్యాచారం కేసు కీలక ఆధారాలతో నివేదిక

ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేసిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందానికి సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం కీలక సాక్ష్యాలు అందజేశారు. ఎన్‌కౌంటర్‌ ఘటనలో చనిపోయిన నిందితులే దిశపై అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టు రుజువు చేసే ఫోరెన్సిక్‌ ఆధారాలతో కూడిన నివేదికను పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేశారు.  దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య, మృతదేహం కాల్చివేత తదితర పరిణామాలకు సంబంధించి తమ దర్యాప్తులో సేకరించిన ఆధారాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ కేసులో అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఎన్‌హెచ్చ్‌ఆర్సీకి అందజేసిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. సంఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్‌లో దొరికిన రక్తం మరకలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్ట్‌, ఘటనా స్థలంలో నిందితుల లారీ సంచరించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసులు అందజేశారు.
చదవండి: దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో

కొత్తూరు సమీపంలో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజీని సైతం సమర్పించినట్టు తెలుస్తోంది. దిశ హత్యాచారం కేసులో శరవేగంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ కేసులో తాము సేకరించిన ఆధారాలు, కేసుకు సంబంధించిన కీలక వివరాలు ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు పెట్టారు. ఇక, దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం వరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచనున్నారు

మరిన్ని వార్తలు