పెళ్లి పేరుతో మోసం

27 Apr, 2018 06:49 IST|Sakshi
 నిందితుడి అరెస్టును చూపెడుతున్న ఏసీపీ మధుసూదన్‌, రోహిత్‌

యువతి నుంచి రూ.7.74 లక్షల నగదు స్వాహా

 మరో 50 లక్షల రూపాయలు కావాలని డిమాండ్‌

 నిందితుడిని అరెస్టు చేసిన వర్ధన్నపేట పోలీసులు

వర్ధన్నపేట : పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఏసీపీ వెల్లడించారు. వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి హన్మకొండలో ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో మ్యాట్రిన్‌గా పనిచేస్తోంది. భర్తతో గొడవపడి కొద్ది రోజుల ఆమె విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి చేసుకోవడానికి ఓ మ్యాట్రిమొనీ సైట్‌లో తన వివరాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బసవకొత్తూరుకు చెందిన నీలగిరి హరిరావు అనే వ్యక్తి డాక్టర్‌ రోహిత్‌కుమార్‌చౌదరిగా పేరు మార్చుకుని ఆ యువతిని ఇష్టపడినట్లు చాటింగ్‌ చేశాడు.

దీంతో డాక్టర్‌ ప్రొఫైల్‌ నచ్చి ఇష్టపడుతున్నట్లు రోహిత్‌కు ఆమె సమాచారం అందించింది. వీరి చాటింగ్‌ క్రమంగా ప్రేమగా మారింది. రోహిత్‌ వరంగల్‌కు రాకపోకలు సాగించడం, ఇద్దరు కలిసి తిరగడం మొదలు పెట్టారు. రెండు నెలల్లో అతడికి రూ.7.74 లక్షలు బ్యాంకు ఖాతా ద్వారా సదరు యువతి బదిలీ చేసింది. తనకు రోహిత్‌ నచ్చాడని, త్వరలో ఆయనతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సైతం చెప్పి ఒప్పించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని రోహిత్‌కుమార్‌ను ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. రోహిత్‌ కుంటి సాకులు చెబుతూ దాటవేశాడు. తన తల్లిదండ్రులు రూ.50 లక్షలు అడుగుతున్నారని, ఆడబ్బులు తెస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె మోసపోయానని గ్రహించింది.

ఎట్టకేలకు ఈ విషయాన్ని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు సన్నిహిత కౌంటర్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. కేసును విచారించాలని, నిందితుడిని పట్టుకోవాలని వర్ధన్నపేట పోలీసులను కమిషనర్‌ ఆదేశించారు. దీంతో వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ, ఎస్సై ఉపేందర్‌ చాకచక్యంతో వ్యవహరించి గురువారం ఉదయం హన్మకొండలోని జూపార్కు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.  
అసలు పేరు నీలగిరి హరిహరరావు
రోహిత్‌ను ప్రాథమికంగా విచారించగా తన పేరు నీలగిరి హరిరావు అని, తమ గ్రామం బసవ కొత్తూరు అని చెప్పాడు. ఆ గ్రామం ఎక్కడ ఉంది అని ఆరా తీయగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఉన్నట్లు తెలిసింది. అక్కడి పోలీసులకు సమాచారం అందించి వివరాలు సేకరించమని కోరగా నీలగిరి హరిహరరావు అలియాస్‌ భాస్కర్‌రావు అనే వ్యక్తి రోహిత్‌కుమార్‌చౌదరిగా పేరు మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైందని ఏసీపీ తెలిపారు. నిందితుడు డిగ్రీ డిస్‌ కంటిన్యూ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈమెతో పాటు పలువురు యువతులను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. అతడి వద్ద ఉన్న 8 వివి«ధ బ్యాంకుల డెబిట్‌ కార్డులు, మూడు  పేర్లతో ఓటరు కార్డులు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హరిహరరావును కోర్టులో హాజరుపరిచి, కోర్టు నుంచి అనుమతి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఏసీపీ మధుసూదన్‌ వెల్లడించారు. 
యువతులు అప్రమత్తంగావ్యవహరించాలి
సైట్లలో పెట్టే ప్రతి విషయం నమ్మదగినదిగా ఉండదని, పూర్తి స్థాయిలో విషయం కనుక్కొని పెళ్లి విషయంలో ముందుకు పోవాలని ఏసీపీ సూచించారు. లేనిపోనివి చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ ఆదినారాయణ, ఎస్సై ఉపేందర్‌రావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు