చేతివాటానికి చెక్!

22 Jul, 2015 01:21 IST|Sakshi
చేతివాటానికి చెక్!

 తాండూరు : పొదుపు సంఘాలనూ అవినీతిపరులు వదలడం లేదు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహకరించేదిపోయి వారికి మంజూరైన నిధుల్లోంచి కమీషన్లు నొక్కేస్తున్న వైనం బయట పడింది. వేలు వందల్లో కాదు.. ఏకంగా ఈ కమీషన్లు రూ.లక్షల్లోకి చేరుకున్నాయి. జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో కొనసాగుతున్న మహిళా సంఘాలకు ఈ బెడద ఎక్కువగా ఉంది. మహిళా సంఘాల వ్యవహారాలు చూస్తున్న కొందరు రీసోర్స్ పర్సన్ (ఆర్‌పీ)లు కమీషన్లు దండుకుంటున్నారు.

అయితే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ (అర్బన్ ఐకేపీ మెప్మా) వెంటనే నివారణ చర్యలు ప్రారంభించింది. బ్యాంకు లింకేజీ/ రుణాల మంజూరు వ్యవహారాల్లో ఆర్‌పీల ప్రమేయానికి చెక్ పెట్టింది. ఇక నుంచి ఆర్‌పీలతో సంబంధంలేకుండా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు మెప్మా అధికారులు లేఖలు రాశా రు. ఇకపై ఆర్‌పీలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. సంఘాల సభ్యు లు బ్యాంకుకు వెళ్లి అధికారులను కలవా ల్సి ఉంటుంది. సంఘాల సభ్యులు అందరూ వస్తేనే రుణాలు మంజూరు చేయాలని ఐకేపీ జిల్లా అధికారులు బ్యాంకులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

 అర్బన్‌లో 3,701 సంఘాలు..
 జిల్లాలో ఐకేపీ అర్బన్ పరిధి కిందకు వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్, మేడ్చల్, పెద్ద అంబ ర్‌పేట్ మున్సిపాలిటీలు వస్తాయి. ఈ ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 3,701 మహిళా పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి 1,201 సంఘాలు బ్యాంకు లింకేజీకి అర్హత సాధించాయి. వీరికి రూ.31.71 కోట్ల రుణాల లింకేజీ లక్ష్యం. ఇప్పటివరకు 195 సంఘాలకు రూ.5.51 కోట్ల బ్యాంకు లింకేజీ జరిగింది.

 ఇదీ ఆర్‌పీల పని..
 కొత్త సంఘాల ఏర్పాటు, పొదుపు ఎలా చేయాలి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆర్‌పీలు పర్యవేక్షించాలి. రుణాల రికవరీ జరిగేలా చూస్తుండాలి. కానీ కొందరు ఆర్‌పీలు బ్యాంకు రుణాల మంజూరులో జోక్యం చేసుకుంటున్నా రు. తమకు అనుకూలమైన సంఘాల్లో ఒకరిద్దరు సభ్యులను వెంట బెట్టుకొని బ్యాంకు వెళుతున్నారు. సం ఘాలకు రుణాలు మంజూరు వ్యవహారాలన్నీ వీరే చక్కపెడుతున్నారు. ఇదంతా చేసినందుకు కొందరు ఆర్‌పీలు మంజూ రైన రుణ మొత్తంలో 5-10 శాతం మేరకు వాటాలు దండుకుంటున్నారని తెలుస్తోంది.

రూ.కోట్లలో జరుగుతున్న రుణా ల లింకేజీలో వాటాల పర్వం రూ. లక్షల్లో జరుగుతున్నట్టు సమాచారం. సదరు ఆర్‌పీల వల్లనే రుణాలు మంజూ రవుతున్నట్టు భావిస్తున్న సంఘాల సభ్యులు వాటాలు సమర్పించుకుంటూ నష్టపోతున్నారు. కొత్తగా సంఘం ఏర్పాటు చేసుకొనే మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ వ్యవహారాలు అధికంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వాటాల వ్యవహారం రుణాల రికవరీ మీద ప్రభావం పడుతుంది. వాటాలు మినహా మిగతా రుణ  డబ్బులు చెల్లిస్తామని సంఘాలు చెబుతున్నాయని, ఎం దుకని అడిగితే ముందే ఆర్‌పీలకు డబ్బు  కట్టామని పలు సంఘాల సభ్యులు చెబుతున్నారని బ్యాంకు అధికారి చెప్పారు.
 
 అవకతవకలను అరికట్టేందుకే..

 సంఘాల ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను అరికట్టేందుకు బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరులో ఆర్‌పీల ప్రమేయం లేకుండా చేస్తున్నాం. ఈ మేరకు మెప్మా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ ఇటీవల బ్యాంకులకు లేఖలు రాశారు. కొందరు ఆర్‌పీలు రుణాల మంజూరు చేయించినందుకు డబ్బులు తీసుకోవడం వల్ల సంఘాల సభ్యులు నష్టపోతున్నారు. నిజాయితీగా పొదుపు చేసిన సంఘాలకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటాల వ్యవహారాలను పూర్తిగా నిర్మూలించి సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
 - ఏపీడీ బ్రహ్మయ్య

మరిన్ని వార్తలు