నాలుగు నిమిషాలు..40 వేల లీటర్లు!

12 May, 2019 02:38 IST|Sakshi

రైళ్లలో నీటి కష్టాలకు చెక్‌

అందుబాటులోకి ‘క్విక్‌ వాటరింగ్‌ ప్రాజెక్టు’ 

తొలుత సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడలో ఏర్పాటు 

రైలు ఆగి.. తిరిగి బయలుదేరేంతలోపే ట్యాంక్‌ ఫుల్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన నగేశ్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరాడు. రాత్రి భోజనం ముగించుకున్నాక రైలు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. కానీ అక్కడ నీళ్లు రావడం లేదు, వెలుపల హ్యాండ్‌ వాష్‌ దగ్గర పరిశీలించాడు, అక్కడా అదే కథ. మరో బోగీకి వెళ్లి చూసినా, పరిస్థితిలో మార్పులేదు. కాసేపట్లో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. అత్యవసరాలకు కూడా నీళ్లు లేకపోవడమేంటని వారు సిబ్బందిని నిలదీశారు. రైలులో నీళ్లు అయిపోయాయని, మధ్యలో నింపే వెసులుబాటు కూడా లేదని, ఏదైనా ప్రధాన స్టేషన్‌లో నింపాలంటే అరగంట సమయం పడుతుందని, అంతసేపు రైలును ఆపలేమని చెప్పి చేతులెత్తేయటంతో జనం ఆగ్రహంతో సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. 

ఇది ఈ ఒక్క రైలుకే పరిమితం కాదు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో తరచూ ఏర్పడే సమస్యే. గత వేసవి కాలంలో మొత్తం రైలు ఫిర్యాదుల్లో 42 శాతం ఇవే కావటం విశేషం. మెరుగైన ప్రయాణం సంగతి దేవుడెరుగు, రైళ్లలో కనీసం నీళ్లు కూడా ఉండవు అన్న అపవాదును భారతీయ రైల్వే మూటగట్టుకుంది. ఇంతకాలం తర్వాత దీనికి విరుగుడు మొదలుపెట్టింది. ఇప్పుడు ఇక నీటి సమస్య ఉండదు. 

కేవలం నాలుగు నిమిషాల్లో... 
రైలు ప్రయాణంలో నీటి ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాగునీరైతే కొనుక్కుంటారు. కానీ వాడుక నీరు లేకుంటే ఇబ్బంది అంతాఇంతా కాదు. దూరప్రాంతాలకు వెళ్లేవారి అవస్థలు ఎన్నో. ఇటీవలి వరకు ప్రయాణికులను ఈ సమస్య వెంటాడింది. ప్రారంభ స్టేషన్‌లో నిండుగా నీటిని నింపిన తర్వాత వేసవి సమయాల్లో ఆ నీళ్లు వేగంగా అయిపోయేవి. మళ్లీ ఆ నీటిని నింపాలంటే అన్ని స్టేషన్‌లలో వసతి ఉండేది కాదు. వసతి ఉన్నా రైలు మొత్తం నీటిని నింపాలంటే కనీసం 25 నిమిషాల నుంచి అరగంట పట్టేది. అంతసేపు రైలును నిలపడం వీలు కానందున, కొంత నీటినే నింపేవారు. కాస్త దూరం వెళ్లగానే అవి అయిపోయేవి. దీంతో గమ్యం చేరుకునేవరకు నీళ్లు లేకుండానే రైలు వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణికుల నుంచి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో ఎట్టకేలకు రైల్వే మేల్కొంది. 

ఇప్పుడు ప్రధాన స్టేషన్‌లలో ‘క్విక్‌ వాటరింగ్‌ సిస్టం’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ఏర్పాటు చేశారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం బోగీల్లో నీళ్లు నింపే పాత పైప్‌లైన్‌లు మార్చి కొత్తవి ఏర్పాటు చేశారు. ఒక్కోచోట నాలుగు చొప్పున 40 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు అమర్చారు. ఈ పైప్‌లైన్‌ నుంచి బోగీలకు చిన్న పైప్‌లను అమర్చి మోటారు అన్‌ చేయగానే కేవలం నాలుగు నిమిషాల్లో మొత్తం రైలులోని నీటి ట్యాంకులు నిండిపోతాయి. పైగా ఒకేసారి అన్ని బోగీల్లో నీళ్లు నిండుతాయి. మరో లైన్‌లో నిలబడిన రైలుకు కూడా అదే సమయంలో నీళ్లు నింపేలా ఏర్పాటు చేశారు. వెరసి నాలుగు నిమిషాల్లో రెండు రైళ్లలో ట్యాంకులు నింపేయొచ్చన్నమాట. నీళ్లు అయిపోయిన రైలు వచ్చి ఆగి.. తిరిగి బయలుదేరేంత సమయంలోనే నీటిని నింపేస్తారు. కొద్దిరోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చింది.  

ఈ వ్యవస్థను సెన్సార్లు, రిమోట్‌లతో అనుసంధానించారు. నీళ్లు నిండగానే సెన్సార్లు గుర్తించి ఆటోమేటిక్‌గా పంపింగ్‌ నిలిచిపోయేలా చేస్తాయి. ఈ పనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మనుషులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మోటారు వద్ద ఉండే వ్యక్తి రిమోట్‌ సాయంతో దాన్ని ఆపరేట్‌ చేయొచ్చు. అంతకుముందు పంపింగ్‌ సామర్థ్యం లేక ఒక బోగీ నిండాక మరో బోగీ నింపాల్సి వచ్చేది. పైప్‌లైన్‌కు లీకేజీల వల్ల నీళ్లు కూడా వృథాగా పోయేవి.  

- ఈ ప్రాజెక్టు కోసం రైల్వే బోర్డు గతేడాది రూ.300 కోట్లు విడుదల చేసింది. ప్రధాన స్టేషన్‌లకు రూ.2 కోట్లు చొప్పున కేటాయింపులు చేసింది. ఏప్రిల్‌లో పనులు పూర్తయి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. 
ఒక్కో బోగీకి 1,600 లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకులుంటాయి. గరిష్టంగా పెద్ద రైలులో 40 వేల లీటర్ల నీళ్లు అందుబాటులో ఉంటాయి. గతంలో ఇన్ని నీళ్లు నింపాలంటే దాదాపు అరగంట పట్టేది. కొత్త వ్యవస్థతో ఇది 4 నిమిషాల్లో పూర్తవుతుంది. 
దేశవ్యాప్తంగా 142 స్టేషన్‌లలో ఈ వ్యవస్థ అందుబాటులోకిరాగా, దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడల్లో ప్రారంభించారు. త్వరలో మిగతా ప్రధాన స్టేషన్‌లలో ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు