చిరుత చిక్కింది

18 Mar, 2014 01:38 IST|Sakshi
చిరుత చిక్కింది

బెజ్జంకి, న్యూస్‌లైన్ : కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత అనూహ్యంగా ఉచ్చులో చిక్కింది. వేటగాళ్లు అడవిపందుల కోసం అమర్చిన ఉచ్చులో ప్రమాదవశాత్తు చిక్కిన చిరుత కాసేపు నానా హంగామా సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది గంటల ఉత్కంఠ పరిస్థితుల అనంతరం చిరుతను బంధించి తరలించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
 
 బెజ్జంకి మండలం హన్మాజిపల్లెకు చెందిన తోటపల్లి లచ్చయ్య అనే గొర్లకాపరి సోమవారం ఉదయం 11.30 ప్రాంతంలో గొర్లమందను గ్రామ శివారు పంతుళ్ల కొండాపూర్ ల్యాగల గుట్ట సమీపానికి మేతకు తీసుకెళ్లాడు. అటువైపు వెళ్తుండగానే గొర్లు ఒక్కసారిగా బెదిరిపోయాయి. కాసేపటికి తోటపల్లి చిన్నచంద్రయ్య గొర్లు కూడా అక్కడివరకు వెళ్లి బెదిరి చెల్లాచెదురయ్యాయి.
 
 గొర్లకాపరులు వెళ్లి చూడగా వారికి చిరుత కనిపించడంతో ఒక్కసారిగా బెదిరిపోయారు. అడవిపందుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత చిక్కుకుందని గుర్తించి, వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. సర్పంచ్ హన్మండ్ల నర్సవ్వ, గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఎస్సై ఉపేందర్‌రావు, తహశీల్దార్ కిష్టయ్యకు సమాచారం అందించారు. వారు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.
 
 8 గంటలు ఉత్కంఠ
 చిరుత చిక్కిందనే సమాచారం మండలవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఫారెస్ట్ అధికారులు డీఎఫ్ ఏఎస్పీ జోజీ, డీఎఫ్‌వో నర్సయ్య, కరీంనగర్ రేంజ్ అధికారి వాహబ్ 2 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు. 6 గంటల ప్రాంతంలో వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాజరాం, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రెస్క్యూ టీం సభ్యులు బాలాజీ, కృష్ణ, సదానందం, చారి చేరుకున్నారు.
 
 డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చిరుతకు మత్తు ఇంజక్షన్ వేయగా మూడు సార్లు గురితప్పింది. నాలుగోసారి ఇంజక్షన్ చిరుతకు తగిలినా మత్తు ఎక్కలేదు. మరోసారి ప్రయత్నంలో చిరుతకు మత్తు ఎక్కడంతో దాని దగ్గరికి వెళ్లిన అధికారులు చిరుత ముందరికాలుకు ఉన్న ఉచ్చును తొలగించారు. బోనులోకి ఎక్కించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలించారు. డీఎస్పీ రవీందర్ ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించారు.
 
 
 ఊపీరి పీల్చుకున్న ప్రజలు
 మండలంలోని మైలారం, హన్మాజిపల్లె, గోపాల్‌పూర్ గ్రామాల్లో చిరుత సంచారంతో రెండేళ్లుగా ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. రైతులు రాత్రివేళ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతేడాది ముచ్చతల లక్ష్మారెడ్డి అనే రైతుకు చెందిన లేగదూడ బావి వద్ద ఉండగా చిరుత తినేసింది. మూడురోజుల క్రితం హన్మాజీపల్లికి చెందిన పురుషోత్తం రాజయ్య గొర్రె పిల్లను, రెండు రోజుల క్రితం మైలారం గ్రామానికి చెందిన మడికట్టు అశోక్ లేగదూడను తినేసింది. దీంతో భయాందోళన పెరిగిపోయింది.
 
 అడవిపందుల బెడద కూడా ఎక్కువగానే ఉంది. అయితే వేటగాళ్లు అడవిపందుల కోసం ల్యాగలగుట్ట సమీపంలో అమర్చిన ఉచ్చులో అనూహ్యంగా చిరుత చిక్కుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
 
 చిరుత బం ధించే విషయంలో ఫారెస్టు అధికారుల తీరుకు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. 12 గంటల సమయంలో సమాచారం అందిస్తే చాలా ఆలస్యంగా చేరుకోవడంపై మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు