కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత... చేరా ఇక లేరు

25 Jul, 2014 02:57 IST|Sakshi

ఖమ్మం కల్చరల్/మధిర: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఆధునిక భాషా శాస్త్రంలో కొత్త పంథా సృష్టించిన ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు చేకూరి రామారావు(చేరా) (80) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని నివాసంలో గురువారం సాయంత్రం ధ్యానం చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. చేకూరి రామారావుకు భార్య రంగనాయకమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన ముగ్గురు పిల్లలు యుఎస్‌లో ఉంటున్నారు.
 

ఆయన స్వస్థలం మధిర మండలం ఇల్లెందులపాడు గ్రామం. ఆయన 1934, అక్టోబర్ 1న చేకూరి లింగయ్య-భారతమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కాచెళ్లెళ్లు ఉన్నారు. చేరా కొంతకాలం గుంటూరు జిల్లా నర్సారావుపేటలో ఉన్నారు. మచిలీపట్నంలో హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ పూర్తిచేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో భాషాశాస్త్రంపై పరిశోధనలు సాగించారు.

 అనంతరం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో భాషా శాస్త్రవేత్తగా పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ పొందారు. ఆధునిక భాషా శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తెలుగు భాషా శాస్త్రంలో నూతన ఒరవడిని సృష్టించారు.  ‘చేరాతలు’ పేరుతో పత్రికలలో సుదీర్ఘకాలంపాటు సాహితీ కాలం కొనసాగించారు. ‘సృ్మతి కిణాంకం’ అనే వ్యాస సంపుటికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగు సాహితీ విమర్శలో కొత్త ఒరవడికి చేరా నాంది పలికారు.

 ఆయన రాసిన ‘సాహిత్య విమర్శ’, ‘పరామర్శ’, ‘చేరాతలు’, ‘రెండు పదులపైన’, ‘ఇంగ్లిష్-తెలుగు పత్రికా పదకోశం’, ‘ముత్యాల సరాల ముచ్చట్లు’, ‘వచన పద్యం’ తదితర పుస్తకాలు రాశారు. ఆయన రచించిన ‘తెలుగులో వెలుగులు’ అనే భాషా పరిశోధనా వ్యాసానికి మంచి గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన సందర్భంగా 2002లో ఆయనను ఖమ్మంలో ‘సాహితీ స్రవంతి’ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి తదితర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. తెలుగు సాహితీ వినీలాకాశంలో కాంతి వెలుగులు విరజిమ్మిన ‘చేరా’ మృతి సాహితీప్రియులకు తీరని విషాదాన్ని మిగిల్చింది.

 ఎంపీ పొంగులేటి సంతాపం
 చేకూరి రామారావు మృతిపట్ల ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని నివాళులర్పించారు. తెలుగు సాహితీలోకానికి ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు