చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. కలకలం

30 May, 2014 03:21 IST|Sakshi
 • విజృంభించిన చైన్ స్నాచర్లు
 •  మహిళల నగలు లాక్కొని పరారీ
 •  సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు
 •  హైదరాబాద్, న్యూస్‌లైన్ : చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచర్స్ విరుచుకు పడి పలువురి మహిళల మెడల్లోంచి బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. చెన్నై నుంచి నగరానికి వస్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల స్టేషన్ దాటింది. అసలే ఆ ప్రాంతంలో రైలు మెల్లగా నడుస్తుండటంతో ఉక్కపోత భరించలేని ప్రయాణికులు విండోసైడ్ కిటికీలను తెరిచారు.

  ఇంతలో రైలులో ఉన్న కొందరు దుండగులు చైన్ లాగడంతో డ్రైవర్ రైలును నిలిపాడు. అంతే ఒక్కసారిగా చైన్‌స్నాచర్లు విరుచుకుపడ్డారు. 7, 10, 11, 12 బోగీల్లో కూర్చున్న మహిళలకు చెందిన బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఫలితంగా అరగంట ఆలుస్యంగా రైలు నగరానికి చేరుకుంది. బాధిత మహిళలు గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఇక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గుంటూరు రైల్వే పోలీసులకు బదలాయించారు.
   
  బాధిత మహిళలు వీరే!
   
  సనత్‌నగర్ సమీపంలోని ఫతేనగర్‌కు చెందిన సంగీతకు చెందిన 12 గ్రాముల బంగారు గొలుసు, సికింద్రాబాద్ బౌద్ధనగర్‌కు చెందిన పుష్పలత మెడలోని 17 గ్రాముల బంగారు గొలుసు, యూసుఫ్‌గూడకు చెందిన లక్ష్మి మెడలోని ఏడున్నర తులాల బంగారు గొలుసు, అదేప్రాంతంలోని నివేదన అనే మరో మహిళకు చెందిన 20 గ్రాముల బంగారు గొలుసును దుండగులు లాక్కొని పరారయ్యారు. కాగా ఘటన జరుగుతున్న సమయంలో రైలులో ఒక్క పోలీసూ కనిపించలేదని బాధితురాలు సంగీత ఆరోపించారు.
   

మరిన్ని వార్తలు