అమ్మమ్మ ఇంట్లో ఆనందం

9 Jul, 2018 08:43 IST|Sakshi
చిన్నారి చేతనను ముద్దాడుతున్న తల్లి విజయ

ఇంటికి చేరుకున్న చేతన

ఇటీవల అపహరణకు గురైన చిన్నారి

కిడ్నాప్‌తో షాక్‌కు గురయ్యామన్న గిరిజనులు

ఆస్పత్రి నుంచి నేరుగా పుట్టిల్లు ఎనగంటితండాకు చేరుకున్న విజయ

ఆ దంపతులకు మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు. రెండో ప్రసవంలో కూతురు జన్మించాలని కోరుకున్నారు.. వారి మొర దేవుడు ఆలకించాడేమో.. మహాలక్ష్మిలాంటి కూతురు పుట్టింది. దీంతో ఆ భార్యాభర్తలతో పాటు కుటుంబీకులు ఎంతో సంతోషపడ్డారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైపోయింది.

పాపను ఎవరో అపహరించుకుపోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని వెతికి తీసుకొచ్చారు. విచారణ బృందంతో కీలకంగా వ్యవహరించిన అధికారిణి పేరు చేతన.. అందుకే ఆ దంపతులు తమ పాపకు చేతన అని పేరుపెట్టారు. ప్రస్తుతం చేతన తన అమ్మమ్మ ఊరు ఎనగంటి తండాకు చేరుకుంది. 

చౌటుప్పల్‌(మునుగోడు): నగరంలోని కోఠి ప్రసూతి ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన చిన్నారి చేతన ప్రస్తుతం తన అమ్మమ్మ ఊరైన నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ అనుబంధ ఎనగంటి తండాకు చేరింది. తండాకు చెందిన చాంది, సక్రా దంపతుల కుమార్తె విజయకు తొమ్మిదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన సభావత్‌ నరితో వివాహమైంది.

వీరికి ఏడేళ్ల బాబు ఆనంద్‌ ఉన్నాడు. రెండో కాన్పు కోసం విజయను గత నెల 21న హైదరాబాద్‌ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తల్లి చాంది, భర్త నరి తీసుకెళ్లారు. విజయకు రక్తం తక్కువగా వైద్యులు బ్లడ్‌ ఎక్కించారు. అనంతరం 27న ఆపరేషన్‌ చేసి వైద్యులు ప్రసవం చేశారు. విజయ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలో ఓ గుర్తు తెలియని మహిళ ఆస్పత్రి సిబ్బంది మాదిరిగా వచ్చి ఈనెల 2న చిన్నారిని అపహరించుకుపోయింది.

కొంతసేపటి తర్వాత తేరుకున్న విజయ విషయాన్ని కుటుంబీకులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమయస్ఫూర్తి, చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్‌ యంత్రాంగం 48గంటల్లోనే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకుని ఈనెల 4న తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు విజయ నేరుగా కుటుంబీకులతో కలిసి చిన్నారిని తీసుకుని తన పుట్టిల్లు ఎనగంటితండాకు చేరుకుంది.

పరామర్శించి వెళ్తున్న తండావాసులు

చిన్నారి చేతన అపహరణ విషయం తండావాసులకు ఆలస్యంగా తెలిసింది. విషయం తెలిసిన త ర్వాత గిరిజనులంతా చిన్నారి ఆచూకీ దొరకాలని నిత్యం ప్రార్థించారు. రెండు రోజుల అనంతరం ఆచూకీ లభ్యమవ్వడం.. అనంతరం తల్లీబిడ్డలు నేరుగా తమ ఊరికే రావడంతో ఆనందరం వ్యక్తం చేశారు. ఈనెల 5న తల్లిగారింటికి వచ్చిన విజయ, చిన్నారి చేతనను చూసేందుకు తండావాసులతో పాటు పరిసర తండావాసులు, పీపల్‌పహాడ్‌ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.  

మళ్లీ రాను..  

విజయకు రక్తం తక్కువగా ఉండడంతో అవసరమైన మేరకు వైద్యులు రక్తాన్ని ఎక్కించి ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం సైతం ఆమె శరీరంలో తగిన మేర బ్లడ్‌ లేదు. ఇదే విషయాన్ని వైద్యులు ఆమెకు చెప్పారు. డిశ్చార్జి తర్వాత 15రోజులకు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి రావాలని వైద్యులు విజయకు సూచించారు. కానీ, తిరిగి ఆస్పత్రికి వెళ్లేందుకు విజయ ససేమిరా అంటోంది. మరోసారి వెళ్తే.. ఏం జరుగుతుందోనని ఆమె భయాందోళనకు గురవుతోంది.

కలకాలం గుర్తుండాలనే ఆ పేరు  

మొదట కొడుకు పుట్టినందున రెండో కాన్పులో అమ్మాయి కావాలని కోరుకున్నాం. మేం అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టడంతో ఎంతో సంతోషపడ్డాం. అనంతరం నా బిడ్డను గుర్తుతెలియని మహిళ అపహరించుకుపోవడం మనోవేదనకు గురి చేసింది.

పోలీసులు చురుకుగా వ్యవహరించి నా బిడ్డను తిరిగి అప్పగించడంతో ప్రాణం లేచివచ్చింది. దర్యాప్తు బృందంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారిణి ‘చేతన’ మాకు దైవంగా అనిపించింది. అందుకే మా పాపకు ఆమె పేరే పెట్టుకున్నాం.   సభావత్‌ విజయ, చేతన తల్లి   

మరిన్ని వార్తలు