షికాగో దెబ్బ

24 Jun, 2018 02:40 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

ఆటా, తానా ఆహ్వానాలు అందుకున్న వారికీ అమెరికా వీసాల తిరస్కరణ

దరఖాస్తు చేసిన ప్రతి పది మందిలో ఒకరికే వీసా జారీ

సినీ, టీవీ కళాకారులు, ఇతర రంగాల వారికీ చేదు అనుభవం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : మేక మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఉత్తర అమెరికా తెలంగాణ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందడంతో ఇటీవల యూఎస్‌ కాన్సులేట్‌లో బీ1బీ2 వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమెరికా ఎందుకు వెళుతున్నారని అడిగితే.. ఉత్తర అమెరికా తెలుగుసభల కోసమని సమాధానమిచ్చారు.. ఆ మరుక్షణమే ఆయన చేతికి వీసా తిరస్కరణ పత్రం అందింది.

  • సురేఖరాణి, డ్యాన్సర్, టీవీ ఆర్టిస్టు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందడంతో బీ1బీ2(పర్యాటక వీసా) కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 22న వీసా ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆమెకు ఎదురైన ప్రశ్న కూడా ఎందుకు వెళుతున్నారనేదే.. ఆటా సదస్సులో పాల్గొనడానికని సమాధానం చెప్పడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
  •  అమెరికాలో తెలుగు సదస్సులకు అధికారిక బృందాలు వెళుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 24 మందితో కూడిన బృందం అమెరికా తెలంగాణ సదస్సుకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది. ఆ దరఖాస్తులను పరిశీలించిన కాన్సులేట్‌ ప్రతినిధి నలుగురికే వీసా ఇస్తామని ముందస్తు సమాచారం ఇచ్చి మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరించింది.

..ఇలా అమెరికా వీసాలను తిరస్కరించడం గతంలో ఎన్నడూలేదు. తానా, ఆటా, నాటా ఇలా ఏ సదస్సుకు హాజరవుతామని దరఖాస్తు చేసినా 60 శాతం నుంచి 75 శాతం మందికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్‌ కాన్సులేట్‌ తిరస్కరించింది.

సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటంతోనే..
షికాగోలో సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటం, ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్‌ అఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడమే దీనికి కారణం. షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్‌ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్‌ మార్క్‌ పెడుతోంది. వీసా కోసం ఆన్‌లైన్‌లో డీఎస్‌ 160 ఫామ్‌ సమర్పించాలి. ఆ ఫామ్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తాడా? లేదా? అన్నదానికే పరిమితమవుతారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

మే–జూన్‌కు ఎంత తేడా..
మే నెలలో యూఎస్‌ వీసా కోసం వచ్చిన (బీ1బీ2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్‌ మధ్యకు వచ్చేసరికి వీసా తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే.. 1,950 మందికి(65 శాతం) వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్‌ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి(కన్సల్టెన్సీ సంస్థల లెక్కల ఆధారంగా). తెలుగు సదస్సు పేరుతో అమెరికా వెళుతున్న వారు అక్కడకు వెళ్లి ఆరు నెలలు ఉండటం, కొంత మంది మరో మూడు మాసాలు పొడిగించాలని దరఖాస్తు చేయడం వంటివి లెక్కకు మించి ఉంటున్నాయి. షికాగోలో సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటంతో యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ విభాగం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ‘వీసా ఇవ్వాలా? లేదా? అన్న అధికారం కాన్సులేట్‌ అధికారికి ఉంటుంది. ఇందులో ఎలాంటి మతులబూ ఉండదు’అని యూఎస్‌ కాన్సులేట్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

తల్లిదండ్రులకూ తప్పని తిప్పలు..
అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల గ్రాడ్యుయేషన్‌కు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసిన తల్లిదండ్రులకూ తిప్పలు తప్పడం లేదు. గ్రాడ్యుయేషన్‌ కోసం వెళతామన్న తల్లిదండ్రులు, బంధువుల్లో 90 శాతం మందికి వీసాలు మంజూరవుతాయి. కానీ, ఇటీవల ఆ దరఖాస్తులనూ క్షుణ్ణంగా పరిశీలించి నో చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న అధికారి, అతని భార్యకు వీసా ఇవ్వడానికి యూఎస్‌ కాన్సులేట్‌ నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌ సీనియర్‌ అధికారి కుమారుడి గ్రాడ్యుయేషన్‌కు వెళ్లడానికి వీసా చేసుకున్న దరఖాస్తునూ కాన్సులేట్‌ అధికారి గత గురువారం తిరస్కరించారు.

గతంలో ఇలా లేదు..
గతంలో దరఖాస్తు చేసిన వారిలో 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఈ పదిహేను రోజుల్లో మంజూరైన వీసాల సంఖ్య 35 నుంచి 40 శాతానికి పడిపోయింది. గత 15 రోజుల్లో మా సంస్థ 220 దరఖాస్తులను ఫార్వర్డ్‌ చేయగా 34 మందికే వీసాలు వచ్చాయి. గతంలో మా సంస్థ ద్వారా వెళ్లిన 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. – ఓ కన్సల్టెన్సీ ప్రతినిధి  

మరిన్ని వార్తలు