ఓటుకు చికెన్‌ ముక్క

20 Jan, 2019 15:52 IST|Sakshi

2014 ఎన్నికల్లో పోటాపోటీగా చికెన్‌ పంపకం

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో వింత రాజకీయం 

సాక్షి, జగిత్యాలజోన్‌: ఎన్నికలు వచ్చాయంటే ఆ ఊర్లో వింత రాజకీయం నడుస్తోంది. నామినేషన్‌ వేసింది మొదలు.. ఎన్నిక ముగిసేవరకూ పోటీలో ఉన్న అభ్యర్థులు ఆ ఊళ్లో ఉన్న ప్రతి కుటుంబానికీ చికెన్‌ పంపిస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు.. గత రెండుమూడు సార్లు జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పంచారు. ఆయా ఎన్నికల్లో ఈ చికెన్‌ ముక్కలే ఓట్లను ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. ఆ గ్రామమే జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్‌.  

2006లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఓసారి గర్వంద గంగయ్య, గర్వంద గంగాధర్‌ పోటీ పడ్డారు. ఓట్లు వేయాలని ఇంటింటికీ నాలుగైదు సార్లు తిరిగారు. అందరూ ఓట్లేస్తామని ఇద్దరికీ చెప్పారు. కానీ.. అభ్యర్థులు ఒకరికి తెలియకుండా మరొకరు చికెన్‌ను ఓట్ల రాజకీయంలో వాడుకున్నారు. ఇంటింటికీ అరకిలో చికెన్‌ చొప్పున తమ గుర్తులను పెట్టి, ఓటర్లు నిద్ర లేవకముందే తలుపు ముందు పెట్టారు. ఓటర్లు చేసేదిలేక అభ్యర్థులు పంపిన చికెన్‌ను వండుకుని తిన్నారు. మూడు వేల మంది ఉన్న ఆ గ్రామంలో ఎన్నిక జరగగా.. కేవలం ఎనిమిది ఓట్లతోనే గర్వంద గంగయ్య గెలుపొందాడు. 2014లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో సైతం పన్నాల సరిత, పన్నాల విమల పోటీపడి చికెన్‌ ముక్కలతోనే ప్రచారం ప్రారంభించారు. ఇద్దరు అభ్యర్థులు పోటీపడి చికెన్‌ పంచినా.. ఎక్కువసార్లు చికెన్‌ పంపిన పన్నాల సరితకు పట్టం కట్టారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సైతం పోటీపడుతున్న అభ్యర్థులు ‘ఇంటింటికి చికెన్‌..’ రాజకీయాన్నే ఉపయోగించారు. 

ఇంటింటికీ చికెన్‌ 
లక్ష్మీపూర్‌ ప్రస్తుతం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. బరిలో ఉన్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులు సైతం ఇంటింటికీ చికెన్‌ పంపిస్తున్నారు. తెల్లారిందంటే చాలు.. ఇళ్లగుమ్మం ముందు చికెన్‌ పొట్లం కనిపిస్తోంది.. అయితే ఓటర్లు మరింత తెలివి ఉపయోగిస్తున్నారు. ‘శీతాకాలంలో చికెన్‌ రుచి ఉండడం లేదు. మేమే ఓ మేకను లేదా గొర్రెను కోసుకుంటాం.. దాని ఖరీదు ఇవ్వండి..’ అంటూ కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువకుల బృందాలు షరతు పెడుతుండటంతో అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. ఇంకొంతమంది చికెన్‌ పొట్లంతోపాటు మద్యం బాటిళ్లు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘నీ చికెన్‌ ఒక్కసారే వచ్చింది. ఎదుటి అభ్యర్థి రెండుమూడు సార్లు పంపించారు. నువ్వుకూడా మరోసారి పంపించు. అయితేనే ఓటేస్తాం.. అంటూ బహిరంగంగానే చెబుతున్నారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు