మాంసం ‘మస్తు’గా..!

14 Jan, 2019 11:12 IST|Sakshi

పండగ వేళ డిమాండ్‌ ఫుల్‌

ధరలు పెరిగే అవకాశం  

వ్యాపారానికి కలిసొచ్చిన వారాంతం

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రేటర్‌లో మాంసానికి డిమాండ్‌ పెరిగింది. చికెన్, మటన్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి పండగకు వారాంతం కూడా కలిసి రావడంతో వ్యాపారం బాగా జరుగుతోంది. గత దసరాకు కోళ్ల కొరత ఏర్పడడంతో పండగ దృష్ట్యా వ్యాపారులు మేకలు, కోళ్లను స్టాక్‌ పెట్టుకున్నారు. దసరా సమయంలో చికెన్‌ కిలోకు రూ.250 పలకగా,  మటన్‌ రూ.550–రూ.600 ఉంది. ప్రస్తుతం చలికాలం కావడంతో ఇప్పటికే కిలో చికెన్‌ ధర రూ.200 దాటింది. పండగ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. డిమాండ్‌కు సరిపడా చికెన్‌ లేకపోవడంతో ధరలు పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు.

పైపైకి...  
గత వారం కిలో కోడి ధర రూ.వంద లోపే ఉండగా... మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం కిలో కోడి ధర రూ.105 పలికింది. ఇక మంగళవారం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో చికెన్‌ ధరలు పైపైకి వెళ్తాయి. ఫామ్‌ రేట్లు పెరగడంతో హోల్‌సెల్‌ రెట్లు కూడా పెరగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మటన్‌ ధరలు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్‌లో తెలంగాణ పొట్టేళ్లు అందుబాటులో లేవు. మేకపోతులు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. డిమాండ్‌ సరిపడా లేకపోవడంతో మటన్‌ ధర కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో మటన్‌ రూ.550 ఉండగా, పండగ రోజు మరో రూ.50 పెరగవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.

వీకెండ్‌ సేల్‌...   
ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులు కలిసొచ్చింది. శని, ఆది, సోమ, మంగళవారాలు సెలవులు. దీంతో శని, ఆదివారాల్లోనూ విపరీతంగా మంసం విక్రయాలు జరిగాయి. ఆదివారం ఒక్క రోజే గ్రేటర్‌లో 2లక్షల కిలోల చికెన్‌ అమ్ముడైనట్లు అంచనా. ఇక సంక్రాంతి రోజు దాదాపు 4–5 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సాధారణంగా చలికాలంలో ఉత్పత్తి తక్కువ ఉంటుంది. దీంతో ఈసారి కోళ్ల ఉత్పత్తి కూడా అనుకున్న స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి డిమాండ్‌ మరింత ఉండడంతో కొరత లేకుండా చూస్తున్నామని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు