చికెన్‌.. డౌన్‌

16 Dec, 2019 08:49 IST|Sakshi

భారీగా తగ్గిన ధరలు

కిలో రూ.150–180.. లైవ్‌ రూ.82

ఉత్పత్తి ఎక్కువ.. వినియోగం తక్కువ

చికెన్‌ ప్రియులకు శుభవార్త. ధరలు భారీగా తగ్గిపోయాయి. చలి తీవ్రత, ఆధ్యాత్మిక దీక్షల కాలం కావడం, ఉత్పత్తి భారీగా ఉండడం వంటి కారణాల వల్ల చికెన్‌ ధరలు తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్‌ రూ.150 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. లైవ్‌ ధర రూ.82–92 మధ్య ఉంది. గత వారం పది రోజుల క్రితం వరకు కూడా చికెన్‌ ధరలు కిలో రూ.220కి పైనే ఉండగా..ఇప్పుడు రూ.150కి తగ్గడం గమనార్హం. 

సాక్షి సిటీబ్యూరో: ఆదివారం వచ్చిందంటే చికెన్‌ ప్రియులకు కోడి కూర వండందే ముద్ద దిగదు. చికెన్‌ బిర్యాని, చికెన్‌ కరి ఉంటే చాలు లొట్టలేసుకుని రెండు ముద్దలు ఎక్కువగా ఆరగించేస్తారు. కానీ చలితీవ్రతతో పాటు అయ్యప్ప భక్తుల సీజన్‌కావడంతో నగర జనం చికెన్‌ వైపు ఆసక్తిచూపడడం లేదు. మరోవైపు డిమాండ్‌ కంటే కోళ్ల ఉత్పత్తి ఎక్కువ కావడం కూడా చికెన్‌ ధరలు విపరీతంగా పడిపోవడానికి ప్రధాన కారణం. గత వారం రోజుల్లో ఈ ఏడాదిలో అతి తక్కువ ధరలు నమోదయ్యాయి.  లైవ్‌ చికెన్‌ హోల్‌సేల్‌ ధర కిలో రూ.82 నుంచి రూ. 92 మధ్య ఉంది. చికెన్‌ ధర కూడా విపరీతంగా తగ్గింది. కిలో చికెన్‌ రూ. 150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. ఉత్పత్తికి సరిపడా అమ్మకాలు లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.  

డిమాండ్‌ తక్కువ  సరఫరా ఎక్కువ
సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. ఇక నగర వ్యాప్తంగా లక్ష కిలోలకు అటు, ఇటుగానే విక్రయాలు సాగుతున్నాయి.  ఇతర రోజులతో పోల్చితే  వినియోగం సగానికి సగం తగ్గింది.  పలు కోళ్ల ఫారం వ్యాపారులు ప్లానింగ్‌ చేసుకోని కోళ్లను పెంచుతారు. అయితే కోళ్ల విక్రయాల్లో దాదాపు 30 శాతం తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.  

ఇంకా తగ్గే అవకాశం
శ్రావణ మాసం ముగియడంతో పాటు అయ్యప్ప దీక్షలు ప్రారంభ, చలి తీవ్రత నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో  ఇతర రోజులతో పోల్చితే  వినియోగం సగానికి సగం తగ్గింది. మాములు రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే  గత వారంలో  30కిలోలు కూడా విక్రయించడం కష్టంగా మారిందని ఓ హోల్‌సేల్‌ వ్యాపారి తెలిపాడు. ఆదివారం ఎప్పడైనా కనీసం 150 కిలో కంటే తగ్గకుండా విక్రయిస్తానని అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాంపల్లికి చెందిన ఓ వ్యాపారి చెప్పారు.

మరిన్ని వార్తలు