పండగ వేళ చికెన్‌ అమ్మకాల రికార్డు

22 Oct, 2018 09:10 IST|Sakshi

3 రోజుల్లో 1.30 కోట్ల కిలోల విక్రయం  

ధరలు పెరిగినా తగ్గని అమ్మకాలు

సాక్షి, సిటీబ్యూరో: దసరా పండగ పేరు చెప్పి గ్రేటర్‌లో నాన్‌వెజ్‌ అమ్మకాలు రికార్డు సృష్టించాయి. కొంత మంది గురువారం, మరి కొందరు శుక్రవారం పండగ సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుక ఆదివారం కూడా కొనసాగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగాయని ‘నెక్‌’ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో మటన్‌ కంటే చికెన్‌ విక్రయాలే అధికంగా జరిగాయి. స్టాక్‌ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేయాల్సి వచ్చిందని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి తెలిపారు. పది రోజుల క్రితం కిలో చికెన్‌ రూ.180 ఉండగా, పండగ వేళ రూ. 230కు పెరిగింది. సాధారణ రోజుల్లో ఫారం వద్ద రూ.100 ఉండే కోడి ధర సైతం అమాంతం పెరిగింది.  

మూడు రోజులు.. 1.30 కోట్ల కిలోలు..  
గ్రేటర్‌ పరిధిలో సగటున రోజుకు 20 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగుతాయని అంచనా. గురువారం నుంచి అదివారం వరకు 1.30 కోట్ల కిలోల అమ్మకాలు జరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. కేవలం గురు, శుక్రవారాల్లోనే 80 లక్షల కిలోల చికెన్‌ వ్యాపారం జరగ్గా.. అదివారం మరో 50 లక్షల కిలోల వ్యాపారం జరిగింది.  

మటన్‌ అమ్మకాలు తక్కువే..  
ఇటీవల మటన్‌ ధర బాగా పెరిగింది. కిలో రూ.550 దాటింది. దీంతో ప్రజలు చికెన్‌ వైపు మొగ్గు చూపారు. సాధారణ రోజుల్లో నగరంలో 2 లక్షల కిలోల మటన్‌ విక్రయాలు జరగ్గా.. అదివారం ఒక్కరోజు 5 లక్షల కిలోల అమ్మకాలు జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. పండగ మూడు రోజుల్లో దాదాపు 25 లక్షల కిలోల మటన్‌ విక్రయాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దసరా నాటికి కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌కు సరపడా సరఫరా చేయలేకపోయారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకున్నట్టు ‘నెక్‌’ అధికారులు ధృవీకరించారు.

మరిన్ని వార్తలు