ఎన్నికలకు ఈసీఐ సన్నద్ధం

8 Sep, 2018 04:29 IST|Sakshi

10న ఢిల్లీకి సీఈవో రజత్‌కుమార్‌

11న రాష్ట్రానికి ఈసీఐ బృందం

జిల్లాల కలెక్టర్లకు ముగిసిన శిక్షణ 

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఈవో ఆదేశం

అదనపు సీఈవోగా బుద్ధప్రకాశ్‌ నియామకం

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమవుతోంది. అసెంబ్లీకి, లోక్‌సభకు కలిపి నిర్వహించేలా ఇప్పటి వరకు కసరత్తు చేసిన సీఈవో కార్యాలయం ఇప్పుడు వేర్వేరు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ మేరకు షెడ్యూల్‌లోనూ మార్పులు చేస్తోంది. 10న తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (టీఎస్‌సీఈవో) రజత్‌కుమార్‌ ఢిల్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీ రద్దు అంశంపై సమగ్ర నివేదికను ఈసీఐకి సమర్పించనున్నారు. భారత ఎన్నికల సంఘంలోని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌హెచ్‌.ఉమేశ్‌సిన్హా నేతృత్వం లోని బృందం సెప్టెంబర్‌ 11న హైదరాబాద్‌కు రానుంది. అసెంబ్లీ రద్దు పరిణామాలపై నివేదిక రూపొందించి ఈసీఐకి అందించనుంది.

మరోవైపు టీఎస్‌సీఈవో కార్యాలయం ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను గురువారం నుంచే మొదలుపెట్టింది. ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహించే కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని సాంకేతిక సిబ్బందితో శుక్రవారం హైదరాబాద్‌లో అవగాహన కల్పించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం), ఓటరు రసీదు పరికరాల (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌) పనితీరుపై శిక్షణ ఇప్పించింది. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని రజత్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి తగినట్లుగా షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయని, దీనికి అనుగుణంగా జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే... వెంటనే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని రెండు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు.  

మొదటిసారి రసీదులు...  
ఓటరుకు రసీదు ఇచ్చే విధానం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో రాష్ట్రంలో తొలిసారి అమల్లోకి రానుంది. ఓటు వేయగానే దీన్ని ధ్రువీకరించేలా రసీదు వస్తుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు ఓటరు రసీదు పరికరాలను అమర్చనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే రాష్ట్రానికి 84,400 ఈవీఎంలను, ఇదే సంఖ్యలో రసీదు పరికరాలు అవసరమవుతాయని సీఈవో కార్యాలయం గత నెలలో అంచనా వేసింది. ప్రస్తుతం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో సగం ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సరిపోతాయని నిర్ధారించింది. వీటిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటరు రసీదు పరికరాలు అమర్చుతున్న నేపథ్యంలో ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 1,400 ఓట్లు మాత్రమే నమోదు చేసే అవ కాశం ఉంటుంది.

ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రాంతాల్లో 1,300 ఓటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 1,200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఎన్నికల కమిషన్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిర్యాదులు, కొత్త ఓటర్లు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని... పోలింగ్‌ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పరిమితి కంటే తక్కువ ఓటర్లతోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణలో 30,518 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 32,573 పోలింగ్‌ కేంద్రాలు ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎస్‌సీఈవో కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.  

పూర్తి స్థాయి సిబ్బంది...
ముందస్తు ఎన్నికల ఏర్పాట్ల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను అదనపు సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాకు దళిత అభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఈవోలో ఖాళీగా ఉన్న డిపూ ్యటీ సీఈవోలు, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది.

ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధం
ఎన్నికల షెడ్యూలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నా మని శుక్రవారం ఒక నివేదిక పంపారు. ఈ నివేదికను శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్‌ సమీక్షించింది. 2018, జనవరి 1వ తేదీ ప్రాతిపదికన ఓటరు జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, సిబ్బంది, వాహనాలు, ఇతరత్రా మౌలిక వసతులన్నీ అందుబాటులో ఉన్నాయని నివేదిక ఇచ్చారు.

ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాల లభ్యత తదితర అంశాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బేరీజు వేయాల్సి ఉంటుంది. 2019, లోక్‌సభ ఎన్నికల కోసం 16.15 లక్షల వీవీప్యాట్‌ యంత్రాలను సమకూర్చాలని బీఈఎల్, ఈసీఐఎల్‌ కంపెనీలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ కోరింది. నవంబర్‌ 28లోగా ఈ మేరకు సమకూర్చనున్నాయి. ఇప్పటికే దాదాపు 50 శాతం యంత్రాలను సమకూర్చినట్టు సమాచారం. అందువల్ల వీవీప్యాట్‌ యంత్రాల లభ్యతకూ ఇబ్బంది ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.  

అక్టోబర్‌ మొదటి వారంలోనే షెడ్యూల్‌?
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు 2013లో ఎన్నికలు జరిగినప్పుడు అక్టోబర్‌ 4న షెడ్యూల్‌ వెలువడింది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 11, 19 తేదీల్లో, మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 25న, రాజస్తాన్‌లో డిసెంబర్‌ 1న, మిజోరంలో డిసెంబర్‌ 4న ఎన్నికలు జరగగా, డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం డిసెంబర్‌ 15 నాటికి మిజోరంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. అలా జరగాలంటే దాదాపు పాత షెడ్యూల్‌నే అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లెక్కన ఆ 4 రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలొస్తే అక్టోబర్‌ మొదటి వారంలోనో లేదా అంతకంటే ముందుగానో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయాల్సి ఉంటుంది.

సీఈసీ ఆదేశాల మేరకు చేస్తాం: రజత్‌కుమార్‌
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ఈఆర్‌వో నెట్‌ 2.0 వెర్షన్‌పై అన్ని జిల్లాల ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ పూర్తి చేశాం. కొత్త ఈఆర్‌వో నెట్‌పైనా అవగాహన కల్పిస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు స్థానిక అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఎలక్ట్రోరల్‌ రోల్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం ఉండేది... కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఈఆర్‌వో నెట్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో నకిలీ ఓటర్లను ఏరివేయవచ్చు.

మరిన్ని వార్తలు