పూర్తయితేనే భరోసా

1 Apr, 2016 02:32 IST|Sakshi
పూర్తయితేనే భరోసా

వీటితోనే సాగు, తాగునీరు
సీఎం కేసీఆర్ జలదృశ్యంలో
►  జిల్లా వివరాలు

 
 సాక్షిప్రతినిధి, వరంగల్ :  సాగునీటి వనరులు, ప్రాజెక్టుల స్వరూపంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో జిల్లాకు సంబంధించిన అధికారిక గణాంకాలను పేర్కొన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు, ప్రాజెక్టుల పరిస్థితులను వివరించారు. నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు లెక్కలను పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తయితేనే జిల్లాకు సాగు, తాగునీటి పరంగా పూర్తి స్థాయిలో భరోసా ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలకు నీటిని సరఫరా చేయడం వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) రెండో దశ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని అధికారిక నివేదిక చెబుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంతో వివిధ రిజర్వాయర్లలో 10.33 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నీటితో వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందుతోంది. దేవాదుల మిగిలిన రెండు దశల నిర్మాణం పూర్తయితే మరో 5,43,750 ఎకరాలకు సాగునీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎస్సారెస్పీ రెండో దశ కాలువతో మరో 3,92,949 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. పలు రిజర్వాయర్లు, ప్రాజెక్టులతో జిల్లాలో ప్రస్తుతం 1,35,487 ఎకరాలకు సాగునీరు అందుతోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు