‘పాలమూరు’తో జల సిరి

11 Jun, 2015 00:01 IST|Sakshi

‘పాలమూరు -రంగారెడ్డి’కి సీఎం శంకుస్థాపన నేడు
 జిల్లాలో 2.84 లక్షల ఎకరాలకు సాగునీరు
 శ్రీశైలం నుంచి 70 టీఎంసీల జలాలు
 ముంపు గ్రామాలకు విముక్తి
 నాలుగేళ్లలో బీడు భూములు సస్యశ్యామలం
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నెర్రెలు పట్టిన నేలకు ‘పాలమూరు ఎత్తిపోతల’ వరదాయిని కానుంది. సుమారు 2.84 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది ఆవాసాలకు తాగునీరందించే ఈ ప్రాజెక్టు జిల్లాకు ఆదరువుగా నిలవనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మహబూబ్‌నగర్‌లో ఈ పథకం పనులకు శంకుస్థాపన చేస్తుండడంతో జిల్లా రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.
 
 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్టును డిజైన్‌చేసిన ప్రభుత్వం.. దీని నిర్మాణానికి రూ.32,500 కోట్లు ఖర్చు చేయనుంది. శ్రీశైలం నుంచి యేటా 70 టీఎంసీల కృష్ణాజలాలను తరలించడం ద్వారా మూడు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. తొలుత జూరాల నుంచి నీటిని తీసుకురావాలని ప్రతిపాదించినప్పటికీ, రిజర్వాయర్ల నిర్మాణంతో ముంపు బారిన పడే గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. దీంతో గండేడ్‌లో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌ను పక్కనపెట్టింది.
 
 తద్వారా ముంపున పడే అవకాశమున్న తొమ్మిది గ్రామాలకు ఊరట లభించింది. గండేడ్‌లో రిజర్వాయర్ నిర్మాణంలేకపోయినప్పటికీ, గతంలో నిర్ణయించిన ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళిక రూపొందించారు. పరిగి సమీపంలో కేపీ లక్ష్మీదేవిపల్లిలో మాత్రం 10 టీఎంసీల సామర్థ్యంతో కూడిన రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. దీని కెపాసిటీ పెంచే యోచనను కూడా నీటిపారుదల శాఖ చేస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో జిల్లాలోని పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు జలకళ సంతరించుకోనున్నాయి.
 

మరిన్ని వార్తలు