ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు

3 Apr, 2019 04:29 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి

సాక్షి, హైదరాబాద్‌: ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి తెలిపారు. సచివాలయంలో మంగళవారం సీఎస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు ఉమేష్‌ సిన్హా, సుదీప్‌జైన్‌ కలిశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా, సీఈవో రజత్‌కుమార్, అడిషన్‌ సీఈవో బుద్ధప్రకాశ్‌జ్యోతి, ఆర్థికశాఖ అధికారి శివశంకర్, అడిషనల్‌ డీజీ(ఎల్‌వో) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ...పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు 145 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి బలగాల కేటాయింపుపై చర్చించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ఈవీఎంలు ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్‌ నుంచి వస్తున్నాయన్నారు. దీనికి అవసరమైన అదనపు సిబ్బంది, టేబుళ్లు, ఇంజనీర్ల కేటాయింపు, పోలింగ్‌ బూత్‌లలో సౌకర్యాలు తదితర అంశాలపై కూడా కేంద్ర ఎన్నికల అధికారులతో చర్చించారు. నిజామాబాద్‌ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలపై ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తామని వారికి తెలిపారు. సీఈవో రజత్‌కుమార్‌ మాట్లాడుతూ..నిజామాబాద్‌ ఎన్నికలకు అవసరమైన అదనపు సిబ్బంది వివరాలు సమర్పిస్తామని, పోలింగ్‌ బూత్‌ల్లో చేపట్టాల్సిన అన్ని వసతులపై చర్యలు తీసుకుంటున్నామని నివేదించారు. 

మరిన్ని వార్తలు