దత్తతకు చట్టబద్ధత కరువు..

3 Oct, 2019 09:46 IST|Sakshi

అక్రమంగా దత్తత తీసుకుంటున్న దంపతులు

మరికొన్ని చోట్ల విక్రయాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకోవాలంటున్న అధికారులు

ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు 127 మంది అడాప్షన్‌

ఆడపిల్లే ఇంటికి దీపం.. ఇంటి మహాలక్ష్మీ.. ఓపిక, సహనం.. సాహసానికి ప్రతిరూపం.. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పై చేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న సమయంలో అక్కడక్కడా ఆడపిల్లను అంగడిలో సరుకును చేస్తున్న సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఆడ పిల్లలు భారం కావద్దని భవిష్యత్‌కు ఆధారం కావాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొంత మంది డబ్బులకు ఆశపడి అమ్మకానికి, అక్రమ దత్తతలకు ఇస్తున్నారు. దత్తతను ఇస్తున్నట్లు నాన్‌ జ్యుడీషియల్‌ పేపర్ల మీద రాసుకుని ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల నర్సంపేటలోని లక్నెపల్లిలో జరిగిన సంఘటనే ఉదాహరణ..

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. దీంతో దుగ్గొండి మండలం మహ్మదాపురంకు చెందిన దంపతులకు ఆడపిల్లను దత్తత ఇచ్చారు. ఈ దత్తత తీసుకున్న దంపతులకు వివాహమై 15 సంవత్సరాలవుతోంది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో దత్తతను తీసుకుంటున్నామని, దత్తత తీసుకున్న దంపతులు ఆ పాప పేరు మీద ఇల్లు, 0.20గుంటల పొలాన్ని రాసిచ్చారు. దత్తతను ఇచ్చిన వారు ఎక్కడా తమ పాప అని చెప్పవద్దని నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌పేపర్‌పై దత్తత పత్రం రాసుకుని సెప్టెంబర్‌ 19న దత్తతను తీసుకున్నారు. ఈ దత్తత విషయం ఈ నోట ఆ నోట పడి ఈ నెల 1న జిల్లా చైల్ట్‌ వైల్ఫేర్‌ అధికారులకు చేరింది. దీంతో చుట్టు పక్కల వారిని విచారించగా నిజమేనని తెలింది. దత్తత ఇచ్చిన పాపను తీసుకుని శనివారం చైల్డ్‌ వేల్ఫెర్‌ కమిటీ ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు 127 మంది దత్తత..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారా ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు 127 మందిని దంపతులు దత్తత తీసుకున్నారు. అందులో అబ్బాయిలు 30 మంది, అమ్మాయిలు 97 మందిని తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఆడ శిశువుల విక్రయాలు సాగుతున్నాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో బయటకు వస్తున్నాయి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తల్లితండ్రులు బాలికలమీద అదే వివక్ష కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్యా అందిస్తున్న సైతం శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి.

దత్తత ఇలా తీసుకోవాలి
పిల్లలు లేని దంపతులు తమ బంధువుల పిల్లలను దత్తత తీసుకున్న సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాలి. అక్రమ దత్తత చట్టరీత్యా నేరం. కేంద్ర  ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానాన్ని 2014 నుంచి అమలు చేస్తున్నారు. ఠీఠీఠీ.ఛ్చిట్చ. nజీఛి.జీ n లో దరఖాస్తు చేసుకోవాలి. దత్తత విషయంలో దంపతులకు సంబంధించిన ప్రధానమైన మూడు అంశాలను సంతృప్తికరంగా ఉంటేనే బాలల సంరక్షణ కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. దంపతులు ఆరోగ్యం సామాజికపరమైన అంశాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్రమిత తదితర వ్యాధులతో అనారోగ్యం కలిగి ఉండడం, ఇతర పోలీసు కేసులు ఉండడం కనీస ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనట్లయితే దత్తత ఇవ్వరు. దత్తతకు సిద్ధమైన దంపతులు కౌన్సెలింగ్‌ తర్వాత దరఖాస్తు చేయడం పూర్తయ్యాక చివరి దశలో అంటే ఆరోగ్యం పోలీసులు కేసులు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అనుమతి మంజూరవుతుంది.

కన్నవారే కాదంటున్నారు..
తండాల్లో ఎక్కువగా శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూడగా మళ్లీ ఆడ పిల్ల పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆడ పిల్ల పుట్టిందని వద్దు అని కుటుంబసభ్యులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు మళ్లీ ఆడపిల్లనే పుట్టింది వద్దని ఎవరైనా కావాలంటారా అని సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మద్యవర్తిగా వ్యవహరించి ఆ ఆడ శిశువును విక్రయిస్తున్నారు. వివాహమై పిల్లలు లేని వారు ముందుగా ఆసుపత్రి సిబ్బందికి చెప్పి పెడుతున్నారు. ఎవరైనా ఆడపిల్లను ఇస్తే పెంచుకుంటామని పిల్లలు లేని తల్లితండ్రులు చెబుతున్నారు.

అక్రమంగా దత్తత తీసుకోవద్దు
అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారా నిబంధనల ప్రకారం దత్తతను తీసుకోవాలి. అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. విక్రయించినా, కొనుగోలు చేసినా శిక్షార్హులు. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించినా, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం.
– మహేందర్‌రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి

మరిన్ని వార్తలు