-

ప్రాణం తీసిన ఆలస్యం..

22 Oct, 2018 09:00 IST|Sakshi
బాలింతరాలు పద్మ ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన..

అందుబాటులో లేని ఉన్నతాధికారులు

సుల్తాన్‌బజార్‌: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. వారిని ఆసుపత్రి సెక్యూరిటీగార్డులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సుల్తాన్‌బజార్‌ ఎస్‌ఐ లింగారెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, పలుగు తాండాకు చెందిన మహేందర్‌ భార్య పద్మ(25) ఈ నెల 16న రెండో కాన్పుకోసం సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. ఆదివారం తెల్లవారు జామున ఆమెకు నొప్పులు రావడంతోత నైట్‌ డ్యూటీ డాక్టర్‌ టాబ్లెట్‌ ఇవ్వడంతో నిద్రపోయింది. ఉదయం 5 గంటల సమయంలో పద్మకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు  సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి మృత శిశువును బయటికి తీశారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తమ శిశువు బతికి ఉండేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ శిశువు మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

సెలవులు వస్తే అంతే..
సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రి వివాదాలకు నిలయంగా మారుతుంది. సెలవురోజుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పేద మహిళలు, నవజాత శిశువులకు ప్రాణసంకటంగా మారుతోంది. వైద్యులు అందుబాటులో లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో  ఆసుపత్రిలో మాత, శిశువుల ప్రాణా నష్టాలు అధికంగా ఉంటున్నాయి. తాజగా పద్మ గర్భిణికి ప్రతి నెల ఈ ఆసుపత్రిలోనే అన్ని వైద్య పరీక్షలు జరిగి, స్కానింగ్‌లో సైతం శిశువు ఆరోగ్యంగా ఉన్నా వైద్యుల ఆలస్యం కారణంగా కడుపులోనే శిశువు మృతి చెందడం గమనార్హం. ఈ విషయమై ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు