చిన్నారి మృతితో కలకలం

8 Feb, 2015 04:14 IST|Sakshi

మూసాపేట: పాల డబ్బాలో కల్లు పోసి... చిన్నారితో తాగించి... అంతమొందించారనే అనుమానంతో తల్లిదండ్రులు, అమ్మమ్మలకు స్థానికులు దేహశుద్ధి చేశారు.అనంతరం వారిని శనివారం పోలీసులకు అప్పగించారు. కలకలం రేపిన ఈ సంఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వివరాలివీ.. మూసాపేట హరిజన బస్తీలో వెంకటేశ్, హేమలత, ఆమె తల్లి సుగుణ  నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 24న నిలోఫర్ ఆస్పత్రిలో హేమలత ఆడబ్డికు జన్మనిచ్చింది.
 
 
 ఇదిలా ఉండగా... శుక్రవారం రాత్రి అనారోగ్యంతో పాప చనిపోయిందని, జీహెచ్‌ఎంసి సిబ్బంది సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశామని ఈ కుటుంబ సభ్యులు స్థానికులకు చెప్పారు. అమ్మమ్మ చెత్త కుప్ప వద్ద కనిపించడంతో... పాపను చంపి, పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి దుస్తులు చెత్తకుప్పలో పడేసేందుకు వచ్చానని అమ్మమ్మ సుగుణ చెబుతున్న మాటలను వారు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గుమిగూడిన స్థానికులు చిన్నారి తల్లిదండ్రులు, అమ్మమ్మకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. దీనిపై అక్కడి వారి వాదన మరోలా ఉంది.
 
 ముగ్గురూ నిత్యం తాగి గొడవపడుతూ ఉండేవారని... చిన్నారి ఆలనాపాలనా చూసుకోలేదని ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా పాపకు తల్లి పాలు ఇవ్వకుండా... పాలడ బ్బాలో కల్లు పోసి తాగించే వారని అంటున్నారు. ఈ క్రమంలోనే కల్లు తాగించి... చిన్నారిని చంపేసి చెత్తకుప్పలో పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అంతేకాక ‘మా పాప మా ఇష్టం... ఇష్టం లేక చంపుకున్నాం. మీకెందుకు?’ అని సుగుణ ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా... పాప అనారోగ్యంతోనే మృతిచెందినట్టు భావిస్తున్నామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు