ఇంటికి చేరిన చిన్నారి శ్వేత

4 Apr, 2015 23:11 IST|Sakshi

హైదరాబాద్: దారి తప్పి వచ్చి బిక్కమొఖంతో చూస్తున్న రెండున్నరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. రెండు గంటల్లోనే ఆ చిన్నారిని తల్లిడండ్రుల చెంతకు చేర్చిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు...మల్లిఖార్జున్, రేఖ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివాసముంటున్నారు. రెండున్నరేళ్ల వీరి కుమార్తె స్వేత శనివారం మధ్యాహ్నం ఆడుకుంటూ పక్క వీధిలోకి వెళ్లింది. తర్వాత దారి తెలియక ఇంటికి చేరుకోలేక పోయింది.

 

కృతి కుమార్ అనే వ్యక్తి చిన్నారిని దగ్గరకు తీసుకుని వివరాల కోసం ఆరాతీశాడు. ఆ చిన్నారికి సరిగా మాటలు రాకపోవడంతో ఏమీ చెప్పలేక పోయింది. దీంతో చిన్నారిని కృతి కుమార్ నల్లకుంట పోలీసులకు అప్పగించాడు. చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో శ్వేత తప్పి పోయిన విషాయాన్ని పోలీసులకు తెలిపారు. నల్లకుంట పోలీసుల రక్షణలో ఉన్న చిన్నారి వారి కుమార్తెగా గుర్తించారు. అనంతరం చిన్నారిని ఇంటికి చేర్చారు.

>
మరిన్ని వార్తలు