వికటించిన మాత్రలు

11 Feb, 2020 02:17 IST|Sakshi
సహస్ర (ఫైల్‌ )

చిన్నారి మృతి.. మరో 11 మందికి అస్వస్థత

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘటన 

ధర్మపురి/జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం నులిపురుగుల మాత్రలు (ఆల్బెండజోల్‌) వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూ హరిజనవాడకు చెందిన మారుతి, రజిత దంపతుల కూతురు సహస్ర (8) స్థానిక కేరళ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన చిన్నారికి తల్లి భోజనం తినిపించి పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో నులి పురుగుల మాత్ర వేయించేందుకు తీసుకెళ్లింది.

ఆశ వర్కర్‌ ఇచ్చిన మాత్రను అక్కడే వేయకుండా చిన్నారి చదివే పాఠశాలకు తీసుకెళ్లింది. మాత్ర వేశాక తరగతి గదికి పంపించింది. మధ్యాహ్నం 1.12 గంటలకు సహస్రకు ఫిట్స్‌ రావడంతో వెంటనే ఉపాధ్యాయులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పాప అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మాత్ర వికటించే తన కూతురు మృతి చెందిందని తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.  
రోదిస్తున్న బాలిక తల్లి రజిత  

మరో 11 మందికి అస్వస్థత: ధర్మపురిలోని వివిధ పాఠశాలల్లో వేసిన నులి పురుగుల మాత్రలు వికటించి 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో శ్రీచైతన్య భారతి వి ద్యానికేతన్‌కు చెందిన ఏడుగురు, విద్యాభారతి పాఠశాలకు చెందిన నలుగురు ఉన్నారు. జైనా గ్రామంలోని ఓ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు భయంతో ఆస్పత్రికి చేరి పరీక్షలు చేయించుకున్నారు. 

నివేదిక వస్తేనే తెలుస్తుంది
ఆల్బెండజోల్‌ మాత్ర ప్రమాదకరమైంది కాదు. విద్యార్థిని సహస్ర అంతకు పూర్వం భోజనం చేసింది. ఈ మాత్రం సైతం పూర్తిగా వేసుకోలేదు. వేసిన వెంటనే బయటకు ఉమ్మేసింది. నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయి.    
– శ్రీధర్, డీఎంహెచ్‌వో, జగిత్యాల 

మరిన్ని వార్తలు