బాల మేధావులు!

6 Mar, 2018 02:17 IST|Sakshi

అమోఘమైన జ్ఞాపకశక్తి.. అబ్బురపరిచే మేధస్సు

9, 11 ఏళ్లకే పదో తరగతి పాఠాలు కంఠస్థం

వార్షిక పరీక్షలకు అనుమతివ్వాలని అక్కాతమ్ముళ్ల వేడుకోలు

విద్యాశాఖకు వినతులు.. కనికరించని యంత్రాంగం

హైకోర్టుకు, సీఎంకు విన్నపం

వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నా ఇంకా రాని ఆదేశాలు

శ్రీరాంపూర్‌: వారు బాలమేధావులు. అమోఘమైన జ్ఞాపక శక్తి.. అబ్బురపరిచే మేధస్సు.. పిన్న వయస్సులోనే పదో తరగతి పాఠాలు కంఠస్థం. అయితే.. సరస్వతీ కటాక్షం లభించినప్పటికీ ప్రభుత్వ యం త్రాంగం మాత్రం కనికరించకపోవడం ఆ బాలమేధావులకు శాపంగా మారింది. 6వ, 4వ తరగతులు చదువుతున్న అక్కా, తమ్ముళ్లు విశేషప్రతిభతో వయసుకు మించి తరగతుల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు పరీక్షలు పెడితే పదో తరగతిలో 80 శాతం మార్కులతో పాసవుతామని ధీమాగా చెబుతున్నా విద్యాశాఖ ప్రోత్సహించడం లేదు. పరీక్షకు హాజరుకావడానికి వయసు అర్హత వారికి అడ్డంకిగా మారింది.

గతంలో పిన్న వయస్సు పిల్లలను పదో తరగతి పరీక్షలకు అనుమతించిన ప్రభుత్వం.. వీరి పట్ల మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది.  మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం తీగల్‌పహడ్‌కు చెందిన మూల విష్ణువర్దన్‌రెడ్డి, సరితారెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. వయసు రీత్యా కూతురు వర్షితారెడ్డి (11) 6వ తరగతి, కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి (9) నాల్గవ తరగతి చదువుతుండాలి. కానీ వీరు ఇప్పటికే అన్ని తరగతులు చదివేసి పదో తరగతి సబ్జెక్టులో కూడా పట్టు సాధించారు. పిల్లల్లో ఉన్న తెలివితేటలు, ఐక్యూలెవల్స్‌ను వివరిస్తూ వారికి పదో తరగతి వార్షిక పరీక్షలకు అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నారు.

ఆ శాఖలోని అన్ని స్థాయిలోని అధికారుల వద్దకు పిల్లలను తీసుకెళ్లి వారిలో ఉన్న ప్రతిభను చూపెట్టారు. కానీ అధికారులు పదో తరగతి వార్షిక పరీక్ష రాయడానికి కనీస వయస్సు 14 సంవత్సరాలపైన ఉండాలని తోసిపుచ్చారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా.. స్పందించిన కోర్టు వారి మేధస్సును పరీక్షించేందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. ముందుగా వారితో ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రీఫైనల్‌ పరీక్షలు రాయించాలని, అందు లో వారికి 50 శాతం మించి మార్కు లు వస్తే పరీక్షకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖకు సూచించింది.

ఈ మేరకు గత విద్యా సంవత్సరం పరీక్ష నిర్వహించగా హర్షవర్దన్‌రెడ్డికి 61 శాతం, వర్షితరెడ్డికి 73 శాతం మార్కులు వచ్చాయి. అయితే పరీక్షల సమయం దగ్గర పడిందని, ఇప్పుడు వార్షిక పరీక్షలు నిర్వహించలేమని, మరికొన్ని కారణాలను కోర్టుకు చూపుతూ విద్యాశాఖ టెన్త్‌ పరీక్షలకు అనుమతించలేదు.  ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు సీఎం కేసీఆర్‌ను కూడా  కలసి విన్నవించామని, ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఇంత వరకు అమలు జరగడం లేదని దంపతులు వాపోతున్నారు. సీఎం ఎలాగైనా తమ పిల్లల పరీక్షలకు అనుమతిస్తారని   నమ్ము తున్నామని వారు పేర్కొన్నారు.

శ్రీరాంపూర్‌ టూర్‌లో పిల్లలను గుర్తించి మాట్లాడిన సీఎం  
గతనెల 27న శ్రీరాంపూర్‌కు సీఎం కేసీఆర్‌ వచ్చారు. సింగరేణి గెస్టుహౌస్‌ వద్ద నుంచి నస్పూర్‌ కాలనీకి తన కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో పిల్లలిద్దరు వారి తల్లి సరితారెడ్డితో కలసి రాయల్‌గార్డెన్‌ మూల మలుపు వద్ద ఫైలు పట్టుకొని ఉన్న విషయాన్ని గమనించారు. మూలములుపు వద్ద వాహనం స్లో కావడంతో సీఎం వారిని గుర్తుపట్టారు. ఒక్కసారిగా వాహనం ఆపి వారిని దగ్గరకు పిలుచుకొని మీ పని అయిపోతుందమ్మా అంటూ ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు