23 మంది బాలకార్మికుల పట్టివేత

28 Mar, 2019 07:14 IST|Sakshi

అడ్డగుట్ట: బీహార్‌ నుంచి హైద్రాబాద్‌కు అక్రమంగా బాలకార్మికులను రవాణా చేస్తున్నట్లు కార్మిక శాఖ, బాలల హక్కుల సంఘం, బాలల సంరక్షణ విభాగం అధికారుల సమాచారంతో రైల్వే పోలీసులు పెద్ద సంఖ్యలో బాలకార్మికులను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించిన సంఘటన సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...పాతబస్తీలోని  గాజుల పరిశ్రమల్లో పని చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు బీహార్‌ నుంచి బాలలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. బాలల సంఘాల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు.

మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో హైద్రాబాద్‌  జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి ఇంతియాజ్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్, జీఆర్పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో కలిసి తనిఖీలు ప్రారంభించారు. అర్థరాత్రి వచ్చిన దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి  దాదాపు 300 మంది చిన్నారులు, యువకులు కిందకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 23 మంది బాల కార్మికులను గుర్తించారు. కొన్ని ముఠాలు వీరిని నగరానికి తీసుకువచ్చి వివిధ పరిశ్రమల్లో పనిలో పెడుతున్న ట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా బల్లార్షాలో 10 మంది, నాగ్‌పూర్‌లో 40 మంది, కాజీపేట్‌లో 16 మంది బాలకార్మికులను గుర్తించి  అదుపులోకి తీసుకున్నట్లు  తెలిపారు. వారిని తరలిస్తున్న ముఠా సభ్యుల కోసం గాలింపు చేపట్టామన్నారు.

మరిన్ని వార్తలు