అమ్మాయికి 12 ఏళ్లు..అబ్బాయికి 22

11 Apr, 2018 09:58 IST|Sakshi
తహసీల్దార్‌కు హామీపత్రం ఇస్తున్న బాలిక కుటుంబసభ్యులు

బాల్య వివాహ ఏర్పాట్లునిలిపివేత  

బాలిక తల్లిదండ్రులకు అధికారుల కౌన్సెలింగ్‌

వికారాబాద్‌ అర్బన్‌ : బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ చిన్నఅప్పల నాయుడు హెచ్చరించారు. మండల పరిధిలోని ద్యాచారం గ్రామానికి చెందిన ఓ బాలికకు 22 ఏళ్ల యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారని చైల్డ్‌లైన్‌కు సమాచారం అందింది. ఈమేరకు తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మంగళవారం వీఆర్‌ఓ, చైల్డ్‌లైన్‌ సిబ్బంది గ్రామానికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను తీసుకొచ్చి తహసీల్దార్‌ ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాల్య వివాహం ద్వారా జరిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహంతో అమ్మాయి అనారోగ్యం బారినపడుతుందని తెలిపారు. బాలిక చదువు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి వివాహం చేస్తే బాధ్యులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.  బాలికకు మైనారిటీ తీరేవరకు వివాహం చేయబోమని ఆమె తల్లిదండ్రులతో హామీపత్రం రాయించుకున్నారు. గ్రామ కార్యదర్శి ప్రసన్న కుమార్, వీఆర్‌ఓ గోపాల్, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సత్యమ్మ, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్‌ లక్ష్మయ్య, ఎంవీఎఫ్‌ ఆర్గనైజర్లు వెంకటయ్య, ఆశలత ఉన్నారు.

మరిన్ని వార్తలు