మా సంక్షేమం కోసం ఏమీ చేయడం లేదు

4 Feb, 2018 02:41 IST|Sakshi

      తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి

     హైకోర్టుకు బాల్య వివాహాల బాధితుల లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: బాల్య వివాహాల బాధితులుగా మారుతున్న బాలికలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు బాల్య వివాహాల బాధిత యువతులు హైకోర్టుకు లేఖ రాశారు. బి.మహాలత, 10 మంది బాధిత యువతులు ఈ లేఖ రాశారు. హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా పరిగణించింది.

ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆ యువతులు లేఖలో పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో, బలహీనంగా పుడుతున్నారని, చాలా సందర్భాల్లో పిల్లల మరణాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు వివరించారు. బాధిత యువతులకు విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బాల్య వివాహాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.    

మరిన్ని వార్తలు