అంగట్లో ఆడబిడ్డ..!

21 Feb, 2018 17:13 IST|Sakshi

నాలుగు నెలల్లో నలుగురి అమ్మకం

అస్పత్రుల్లోనే కొనసాగుతున్న బేరసారాలు

అధికారుల తనిఖీలతో వెలుగులోకి వచ్చిన ఘటనలు

నిబంధనల ప్రకారమే దత్తత తీసుకోవాలని సూచన...

తల్లి ఒడిలో ఓలలాడాల్సిన చంటి‘పాప’.. అంగట్లో సరుకుగా మారుతోంది. ఆడ పిల్లగా ఈ దాత్రిపైకి రావడమే పాపమన్నట్లు ఈ సమాజం చిన్నచూపు చూస్తోంది. కుటుంబం గడవని స్థితిలో తల్లిదండ్రులు సైతం కన్నపేగును అంగట్లో బేరానికి పెడుతూ తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. జిల్లాలో పెరిగిపోతున్న ఆడ శిశువుల విక్రయాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఆడ పిల్ల ఇంటికి దీపం. ఓపిక.. సహనం.. సాహసానికి ప్రతిరూపం. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పైచేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న నేటి సమాజంలో అక్కడక్కడా ఆడ పిల్లలను అంగడిలో సరుకును చేస్తున్న ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా కన్నవారే ఆడబిడ్డలను దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా లంబాడా తండాలు ఆడ పిల్లల విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి.

నాలుగు నెలల్లో.. నాలుగు ఘటనలు
జిల్లాలో నాలుగు నెలల్లో నలుగురు ఆడ శిశువుల విక్రయాలు జరిగాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని ఓ కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఆడ పిల్ల పుట్టడంతో మధ్యవర్తి ద్వారా 2017 సెప్టెంబర్‌ 25న విక్రయించారు. విషయం ఆ నోట ఈ నోట బయటపడడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించగా నిజమని తేలింది.
     
రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన వారికి ఆడ పిల్ల పుట్టడంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన వారికి 2017 అక్టోబర్‌ 20న విక్రయించారు. చెన్నారావుపేట మండలంలో ఖాదర్‌పేట గ్రామ శివారు గొల్లబామ తండాకు చెందిన ఓ దంపతులు ఆడ శివువును మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన దంపతులకు 2017 నవంబర్‌ 28న అమ్మారు. వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన దంపతులకు మూడో సంతానంగా ఆడ శిశువు జన్మించింది. దీంతో 2018 ఫిబ్రవరి 14న మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్‌ ప్రాంతానికి చెందిన వారికి విక్రయించారు.

కన్నవారే కాదనుకుంటున్నారు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అ నేక పథకాలు అమలు చేస్తున్నా.. బాలికలపై వివక్ష కొ నసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నా.. శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి తండాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూస్తున్నారు. మళ్లీ ఆడ పిల్లే పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెలివరీకి వెళ్లిన ఆస్పత్రులో ఉండగానే కు టుంబ సభ్యులు బేరం పెడుతున్నారు. ఇందుకు ఆస్పత్రుల్లోని కొంతమంది సిబ్బంది మధ్యవర్తులుగా వ్యవహరించి విక్రయాలకు సహకరిస్తున్నారు. వివాహం అయి ఏళ్ల తరబడి పిల్లలు కాని వారి గురించి ఆరా తీసిపెట్టుకుంటుని ఎవరైనా ఆడపిల్లను ఇస్తామని చెప్పగా నే పిల్లలు లేని వారికి సమాచారం చేరవేస్తున్నారు.

అక్రమంగా దత్తత తీసుకోవద్దు
ఆక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన  నిబంధనల ప్రకారమే తీసుకోవాలి. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించిన, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసిన శిక్షార్హులే. చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – మహేందర్‌రెడ్డి, డీసీపీఓ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా