మగ్గిపోతున్న ‘పసి మొగ్గలు’

14 Nov, 2018 14:42 IST|Sakshi
ఇటుక బట్టిలో పనులు చేస్తున్న చిన్నారి (ఫైల్‌)

జిల్లాలో 500 మందికి పైగా పిల్లలు బడి బయటే

నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం

పట్టించుకోని అధికారులు

నేడు బాలల దినోత్సవం

ఆదిలాబాద్‌టౌన్‌ : పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్‌ షెడ్లు, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నారు. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన వీరు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటు వైపుగా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లే దు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు బందీలుగా మిగులుతున్నా రు. బాలల దినోత్సవం సందర్భంగా మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించడం తప్పా వారికి అక్షరాలు దిద్దించేలా పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలు అమలుకు నోచుకోవడంలేదు.

బాట పట్టినా.. బడికి రాని పిల్లలు
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతియేటా బడిబాట కార్యక్రమాలను చేపడుతోంది. ఉపాధ్యాయులు చిన్నారుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించి చేర్పించేలా చూడాలని కోరుతున్నా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అనేక కార్యక్రమాలను చేపడుతున్నన్నా పిల్లలు బడిబాట పట్టడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్‌ చదువుల పండుగ.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 500లకు పైగా మంది చిన్నారులు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆయా మండలాల్లో బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. కాగా అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో కేవలం 144  మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. గత మూడు నాలుగు నెలల క్రితం నిర్వహించిన బడిబాటలో పిల్లల్ని చేర్పించలేక పోయారు. విద్యాహక్కు చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతబడ్డాయి.

నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం..
సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. కొన్నేళ్లుగా విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కావడానికి చట్టం తీసుకువచ్చిన విషయం విదితమే. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2009 ఆగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్‌ నుంచి ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది.

చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత పిల్లలు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు.

పిల్లల్ని బడిలో చేర్పించాలి
బడి బయటి పిల్లల్ని ఉపాధ్యాయులు బడిలో చేర్పించాలి. జిల్లాలో 144 మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తించాం. 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలి.
డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు