బుస్‌..

10 Apr, 2019 07:02 IST|Sakshi
పాముకాటుకు గురై మృతి చెందిన చిన్నారులు (ఫైల్‌)

 పడగ విప్పుతున్న పాములు

బలవుతున్న చిన్నారులు

వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి

భయం, అపోహలతో ప్రాణాపాయం

మూఢ నమ్మకాలతో ప్రాణం మీదకు..

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

పాముకాటుకు బలవుతున్న చిన్నారులను చూస్తుంటే పాములు వారిని పగపట్టాయా? అన్న అనుమానం కలుగుతోంది. కళ్ల ముందే ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న పసిపాపలు పాముకాటు మృతి చెందారన్న విషయాన్ని వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.  జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులు పాముకాటుకు బలయ్యారు.  రెండు రోజుల క్రితం నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన ముదిరబోయిన నాగరాజు, నవ్య దంపతుల పెద్ద కుమార్తె జాహ్నవి(4), మార్చి 30వ తేదీన  తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన కల్లేపు రాజు, మీనా దంపతుల చిన్న కూతురు భవ్య(1) పాము కాటుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో మరెవరూ జీవితాలను నష్టపోకూడదనే ఉద్దేశంతో పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందిస్తున్న  ప్రత్యేక కథనం.

సిద్దిపేటకమాన్‌:  జిల్లాలో పాములు పడగ విప్పుతున్నాయి. గ్రామాల్లో ఇంటి ముందట ఉన్న చెట్లు చేమల నుంచి బయటకు వచ్చి ఏమి తెలియని చిన్నారులను కాటేస్తున్నాయి. వారికి పాము కాటు విషయం తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లేవరకు కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. చివరి నిమిషంలో గుర్తించి ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోతుంది. బాధితులను సకాలంలో ఆస్పత్రికి తీసుకరాకపోవడం, మూఢ నమ్మకాలతో మంత్రాలు వేయిస్తూ కాలయాపన చేస్తుండటం వంటివి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్‌ వీనమ్‌లు ఉన్నాయని వైద్యాధికారులు చెపుతున్నారు. బాధితులకు చివరి నిమిషంలో చికిత్స అందడం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాముల బారిన పడకుండా రక్షించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. గడిచిన రెండు సంవత్సరాల్లో  జిల్లాలో 20 మంది పాముకాటు బారిన పడ్డారు. పాముకాటు వేసిన గంటలోపు ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు చెబుతున్నారు. అంతకుమించితే విషం శరీరం అంతా పాకి మృతి చెందే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటివరకు పాము కాటుకు గురైన వారిలో అత్యధికంగా రైతులే ఉంటున్నారు. కానీ ఇటీవల చిన్నారులు కూడా ఉంటున్నారు. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రికి తరలించకుండా మూఢ నమ్మకాలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మంత్రాలు వేయిస్తూ ఆలస్యం చేయడంతో విషం శరీరమంతా పాకి చనిపోతున్నారు. పాము కాటుకు గురైన వారిని ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్ళాలి.

ఐదు రకాల పాములతో డేంజర్‌:
పాముకాటు బాధితులు భయంతోనే ఎక్కువగా మృతి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
కాటువేసిన సమయంలో భయాందోళనకు గురికావడంతో గుండె పనిచేయటం మానేసి మృతి చెందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పాము కాటు వేస్తే వెంటనే కాటు వేసిన చోట పై భాగాన తాడుతో కట్టు కట్టి సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్ళాలి.
పాము కాటులో రెండు లేదా ఒకటి మాత్రమే గాటు ఉంటే విష సర్పమని గుర్తించాలి. అంతే కాకుండా గాటులోంచి రక్తం కారుతుంది. –––
పాము కాటుకు గురైన వెంటనే ఏలాంటి భయాందోళనకు గురికాకుండా పై భాగంలో కట్టుకట్టి వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
విషంపాము కాటువేస్తే రక్తం కూడా నల్లగా బయటకు వస్తుంది.
దేశంలో 270 రకాల పాములు ఉండగా అందులో 56 రకాల సర్పాలకు మాత్రమే విషం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
మన రాష్ట్రంలో 5 రకాల పాములకు మాత్రమే విషం ఉంటుందంటున్నారు. వాటిలో ముఖ్యంగా నాగు (త్రాచు) పాము, నల్ల కట్లపాము, రక్త పింజరతో పాటు మరో రెండు రకాల పాములు ఉన్నట్లు చెబుతున్నారు.

విషసర్పం కాటు లక్షణాలు
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు పాము, కట్ల పాము వంటి పది శాతం ప్రమాదకరమైన సర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. విష సర్పాలు వేర్వేరుగా ఉన్నట్లే వాటి కాటు వల్ల బాధితుల్లో కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్థాయి ఉంటుంది. సాధారణ తాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లతాచు విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒక రకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి.
కాటు ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది.
నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది.
నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, నోటి నుంచి నురగ రావచ్చు.
కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు.

పాము కాటు వేయగానే చేయాల్సినవి..
భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి.
పక్కనున్న వారు ఆ పాము విష సర్పమో? కాదో? గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత ఖచ్చితంగా అందచేయవచ్చు.

పాములుండే ప్రదేశాలు: ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే ప్రాంతాల్లో ఎలకలను తినడానికి, తడిగా ఉండే చోట కప్పలను తినేందుకు పాములు వస్తాయి.
దుంగలు, కట్టెలు వాటి మధ్యలో పాములు, తేళ్లు ఉండే ప్రమాదం ఉంది.
చేలగట్ల వెంబడి నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. ముఖ్యంగా రాత్రిపూట చిన్న పిల్లలను ఆరు బయట క్రింద నిద్రించకుండా చూడాలి. అలాగే రైతులు రాత్రి పూట మోటారు వేయడానికి, నీరు పెట్టడానికి వెళ్ళేటపుడు విధిగా టార్చిలైట్లు ఉపయోగించాలి.

ధైర్యంగా ఉండాలి
పాము కాటుకు గురైన వారు ఆందోళన చెందకుండా, బయపడకుండా పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం కానీ, ఉరకడం కానీ చేయకూడదు. పాము కాటుకు గురైన వ్యక్తిని తరలించడానికి అంబులెన్స్‌ వచ్చేంత వరకు వేచి ఉండకుండా దగ్గర్లో అందుబాటులో ఉన్న వాహనంలో వీలైనంత తొందరగా దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకరావాలి. ఆస్పత్రిలో పాము కాటుకు ఆంటీ స్నేక్‌ వీణం వాయిల్స్‌ అందుబాటులో ఉన్నాయి.–డాక్టర్‌ క్రాంతికుమార్, జనరల్‌ ఫిజీషియన్‌

ధైర్యంగా ఉండాలి
పాము కాటుకు గురైన వారు ఆందోళన చెందకుండా, బయపడకుండా పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం కానీ, ఉరకడం కానీ చేయకూడదు. పాము కాటుకు గురైన వ్యక్తిని తరలించడానికి అంబులెన్స్‌ వచ్చేంత వరకు వేచి ఉండకుండా దగ్గర్లో అందుబాటులో ఉన్న వాహనంలో వీలైనంత తొందరగా దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకరావాలి. ఆస్పత్రిలో పాము కాటుకు ఆంటీ స్నేక్‌ వీణం వాయిల్స్‌ అందుబాటులో ఉన్నాయి.–డాక్టర్‌ క్రాంతికుమార్, జనరల్‌ ఫిజీషియన్‌

మరిన్ని వార్తలు