అందమైన అబద్ధపు కథలు

17 Aug, 2019 13:08 IST|Sakshi

చిన్నారుల చర్యలు అంతా కృత్రిమమే

సహజత్వం లోపించడంతో అబద్దపు కథలకు అలవాటు

నిర్భందంతో సహజత్వం కోల్పోతున్న చిన్నారులు

ఇటీవల అంబర్‌పేటలో ఓ బాలుడు చెప్పిన కథ అందరినీ అవాక్కయ్యేలా చేసింది

బయటి ప్రపంచం చిన్నారులకు పరిచయం చేయండంటున్న నిపుణులు

అంబర్‌పేట: అమ్మా.. నన్ను కిడ్నాప్‌ చేశారు..! గాబరా పడ్డ తల్లి తండ్రికి సమాచారం అందించింది. నా కుమారుడిని ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ ఆ తండ్రి హైరానా పడ్డాడు. కట్‌ చేస్తే సీన్‌లోకి పోలీసులు వచ్చారు. కిడ్నాప్‌ అనేసరికి పోలీసులతో పాటు స్థానికులు ఉలిక్కిపడ్డారు. రద్ధీగా ఉండే ప్రాంతంలో కిడ్నాప్‌ జరగడానికి అవకాశమే లేదని స్థానికులు అనుమానిస్తున్నప్పటికీ సదరు బాలుడు చెప్పిన స్క్రిప్ట్‌ పక్కాగా ఉండటంతో అంతా నమ్మేశారు. కిడ్నాప్‌ వార్త క్షణాల్లో పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో స్థానిక పోలీసు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన పోలీసులు కిడ్నాప్‌ జరగలేదని నిర్ధారణకు వచ్చారు. అయితే బాలుడు చెప్పిన కథ నమ్మేలా ఉంది. తీరా సీసీ టీవీ కెమెరాలు చూస్తే కిడ్నాప్‌ ఉత్తదే అని నిర్ధారణ కావడంతో అంతా అవాక్కయ్యారు. 

మరో కేసులో....
ఇటీవల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి సైతం ఒత్తిడి తట్టుకోలేక కిడ్నాప్‌ డ్రామా ఆడటం సంచలనం సృష్టించింది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక, బయటికి చెప్పుకోలేక విద్యార్థులు ఒత్తిడితో అసలు చదువు పక్కనబెట్టి ఇలాంటి చర్యలకు దిగడం ఆందోళనకరం. 

బాలుడు చెప్పిన కథ....
ఎల్‌కేజీ నుంచి ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థుల వరకు వారి తల్లిదండ్రులు చదువు పేరుతో చేసే ఒత్తిడి ఈ బాలుడు చెప్పిన కథకు చక్కని నిదర్శనం. 5వ తరగతి చదివే ఈ బాలుడికి తల్లిదండ్రులు ఉదయం లేస్తే పాఠశాల, అనంతరం ట్యూషన్, నిద్రపోవడం మినహాయించి ఎలాంటి ఆటవిడుపు ఇవ్వడం లేదు. కనీసం ఇంట్లో టీవీ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఇంటి నుంచి బయటపడి స్వేచ్ఛాజీవిలా గల్లీలో గంతులేశాడు. గంటకు పైగా పరిసరాలను గమనిస్తూ పరవశించిపోయాడు. గంట తరువాత తల్లి బాలుడి కోసం గల్లీలో వెతుక్కుంటూ రావడంతో గమనించిన బాలుడు భయంతో తల్లి దగ్గరికి పరిగెత్తి ఓ చక్కని అబద్ధపు కథను అప్పటికప్పుడు అల్లాడు. అమ్మా... నన్ను ఎవరో కిడ్నాప్‌ చేశారు. వారి బారినుండి తప్పించుకుని బయటపడ్డానన్నాడు. ఎలా పడ్డావంటే ఇద్దరు వ్యక్తులు ముసుగులతో మారుతీ ఓమ్ని వ్యాన్‌లో వచ్చి ఒక్కసారిగా అందులోకి లాక్కున్నారు. అనంతరం వారిద్దరికీ ఒకేసారిఫోన్‌ రావడంతో వారి బారినుంచి తప్పించుకుని వచ్చానన్నాడు. అందరూ నమ్మేలా కాళ్లకు చేతితో రక్కుకున్నాడు. స్క్రిప్ట్‌ పక్కాగా ఉండడంతో అంతా నమ్మారు.  సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు గల్లీల్లో స్వేచ్ఛగా ఎగిరేతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు అతడి తల్లిదండ్రులకు చూపించి మీ అబ్బాయి కిడ్నాప్‌ కాలేదని, కిడ్నాప్‌ అయ్యానంటూ చక్కని అబద్ధపు కథ చెప్పాడు. దానికి మీ పెంపకమే కారణమంటూ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు.

నిర్బంధం వ్యక్తిత్వ వికాసానికి దెబ్బ
విద్యార్ధులను నిర్బందించి తల్లిదండ్రుల ఆశయాలను వారిపై రుద్దితే వారి వ్యక్తిత్వ వికాసానికి నష్టం జరుగుతుంది. లోకంతీరు వారికి తెలియాలి. పిల్లలకు కావాల్సిన సమకూర్చి అక్కర్లేనివి అంతే ప్రేమతో దూరంగా పెట్టాలే తప్ప దేనినీ అతిగా చేయకూడదు. వారిని స్వేచ్ఛ ఇస్తూనే వెనకాల గమనిస్తూ ఉండాలి. చిన్నారుల ప్రతి అంశంలో అడ్డుతగిలితే వారు భవిష్యత్‌లో ఏమీ చేయకుండా మిగిలే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇతరుల పిల్లలతో పోల్చుకొని తమ పిల్లలు కూడా అలాగే ఉండాలనుకోవడం పొరపాటు.  –బీవీ సత్యనాగేష్, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

సహజ అలవాట్లు నేర్పించాలి
చిన్నారులు తరగతి గదులు, ఫోన్లో ఆటల వరకే పరిమితం కావడంతో వారికి బయటి ప్రపంచంతో పరిచయం లేకుండా పోతోంది. వారు ఎలాంటి పనిచేయాలన్న ఫోన్‌లో జరిగే సంఘటనల ఆధారంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రమాదకరం. వీడియో గేముల్లో కదలికలు, అందులోని చర్యలనే వీరు అనుకరిస్తూ సహజ లక్షణాలను కోల్పోతున్నారు. దీంతో బయటివారు చెప్పే విషయాలను కూడా పట్టించుకోకుండా మొండిగా తయారవుతున్నారు. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి.  –మోహన్‌కుమార్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌

మరిన్ని వార్తలు