మేలుకో.. మానుకో..

13 Apr, 2019 07:01 IST|Sakshi

వాస్తవానికి దూరంగా.. ఇంటర్నెట్‌కు దగ్గరగా..

ఫోన్లు, ఇంటర్నెట్‌లో యువత, చిన్నారులు  

మానసిక రోగులుగా మారుతూ..

పిల్లల అలవాట్లపై నిఘా అవసరం

సోమాజిగూడ: వాస్తవికానికి దూరంగా.. ఇంటర్నెట్‌ గేమింగ్‌కు దగ్గరగా యువతరం వెళ్తున్నట్లు మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు సైతం ఇంటర్నెట్‌ గేమింగ్‌కు అలవాటు పడుతున్నారు. అందుకు బాధ్యత వహించాల్సింది కూడా తల్లితండ్రులే అంటున్నారు వైద్య నిపుణులు. 10 సంవత్సరాల క్రితం ఇటు వంటి వ్యాధులతో తమ వద్దకు వచ్చిన వారు లేరని, అసలు తాము చదివిన చదువుకు ఇప్పుడొస్తోన్న వ్యాధులకు అసలు పొంతన ఉండటం లేదంటున్నారు. నగరాల్లోని పిల్లల తల్లితండ్రులు క్షణం తీరిక లేని జీవితాలు గడుపుతున్నారు. చిన్నారి మారాం చేస్తే ఆడుకో అంటూ సెల్‌ఫోన్లను చేతికి అందిస్తున్నారు. సెల్‌ ఫోనే ప్రపంచంగా వారికి తల్లితండ్రులే అలవాటు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు మరో ధ్యాస ఉండటంలేదు. వారు యుక్త వయసుకు వచ్చినా... మదిలో అవే ఆలోచనలు మెదలడంతో ఎప్పుడూ ఫోన్లతో గడపం, చాటింగ్‌ చేయడం, ఇంటర్నెట్‌ గేమింగ్‌.. అదే ప్రపంచంగా వారు భావిస్తున్నారని నిమ్స్‌ ఆసుపత్రిలోని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్‌ జి.పద్మజ అభిప్రాయం వ్యక్తంచేశారు.

పబ్జీగేమ్‌...
పబ్జీగేమ్‌ వద్దంటేనే పిల్ల్లలు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి వచ్చారంటే అందులో తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉందంటున్నారు మానిసిక వైద్య నిపుణులు. అపార్ట్‌మెంట్‌ కల్చర్‌కు అలవాటుపడిన నగరవాసులు పిల్లల్ని స్కూలుకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. డబ్బాల్లాంటి ఇరుకు గదుల్లో చదువు సాగుతూ వాస్తవిక పరిస్థితులకు పిల్లలను దూరం చేస్తున్నారు. చదువు, మార్కులు తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు నేర్పాలనే విషయాన్నే మరిచిపోతున్నారు. 

ఇయర్‌ ఫోన్‌ మాట్లాడుతూ రైలు ఢీకొని మృతి
నగరంలోని ఎమ్మెస్‌ మక్తాలో నివసించే ఓ యువతి ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని వాకింగ్‌కు వెళ్లింది. నడక పూర్తి అయిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటాల్సి ఉంది. పట్టాలు దాటే సమయంలో అటుగా వచ్చే రైలును ఆమె గుర్తించలేదు. వెనుక నుంచి వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. నడిచినా.. ప్రయాణం చేసినా.. చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పక్కనున్నవారిని కనీసం గమనించడంలేదు. కాస్త ఆగి అటు.. ఇటు.. చూసినా ఆమె ప్రాణాలు దక్కేవి.

రైలు పట్టాలు వద్ద సెల్ఫీ..
ప్రస్తుతం సెల్ఫీ అన్నది అందరికీ పట్టిన పెద్ద జాడ్యంలా మారింది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ యువకుడు రైలు పట్టాల సమీపంలో నడిచే రైలుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. దీనినే సెల్ఫీ టేకింగ్‌ ఎడిక్షన్‌ డిజార్డర్‌ అంటారని వైద్యులు చెబుతున్నారు.

పులితో సెల్ఫీ..
పులితో సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో లైకుల కోసం ఎగబడిన ఓ యువకుడు ఆపులికి ఆహారంగా మారిన ఘటన అందరికీ తెలిసిందే. ఇలా ంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నా.. వారిలో మార్పు రాకపోగా... ఇంకా పెడదారి పడుతున్నారు. దీనికి కారణం ఇంటర్నెట్‌.. 

పిల్లల గేమ్స్‌పై దృష్టిపెట్టాలి
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యాధులు అధికం అతున్నాయి. ఇంటర్నెట్‌ విస్తరించిన అనంతరం మంచితోపాటు చెడూ పెరిగింది. మంచిని వదిలి యువతరం చెడును ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహ భావంగా ఉండాలి. వారు ఎంచుకున్న మార్గం.. అనుసరిస్తున్న పద్ధతులను సున్నితంగా వివరించాలి. ఈ గేమ్స్‌ అన్నీ కల్పితమని, వాస్తవిక క్రీడలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిచయం చేయాలి. సూళ్లలో అధ్యాపకులు విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వాలి. పాఠశాల నుంచి వచ్చిన బిడ్డ ఏమిచేస్తున్నాడు.. అనే విషయాన్ని తెలుసుకోవాలి. – డాక్టర్‌ పద్మజ 

మరిన్ని వార్తలు