పిల్లలు కాదు.. పిడుగులు!

10 Nov, 2017 00:56 IST|Sakshi

జగిత్యాలలో బాలల అసెంబ్లీ 

ప్రశ్నల వర్షం కురిపించిన విద్యార్థులు  

అధికారులనే అబ్బురపరిచిన వైనం

సాక్షి, జగిత్యాల: వారు వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు.. ఐదొందల మందికి పైగా ఒకే చోటుకు చేరారు. ఒకరి తర్వాత ఇంకొకరు అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నల తీరును చూసి సమాధానం ఇవ్వలేక జిల్లాస్థాయి అధికారులే తడబడ్డారు. విద్యార్థినులు సమాజంలో బాలికల వివక్షపై ప్రశ్నల వర్షం కురిపిస్తే.. విద్యార్థులు విద్యాహక్కుపై ప్రశ్నించారు. సుమారు గంటసేపు పలు రకాల ప్రశ్నలతో వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అధికారులందరూ నిలబడే ఉన్నారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నల తీరును చూసి అక్కడున్న వారంతా చూసి నివ్వెరపోయారు. చివరకు అధికారులు.. ‘వెరీ గుడ్‌ క్వశ్చన్స్‌.. చాలా బాగా వేశారు..’అంటూ విద్యార్థులను ప్రశంసించారు. దీనికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాసవీకల్యాణ మండపం వేదికైంది. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా గురువారం బాలల అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని సుగంధిని, ఉప వైద్యాధికారి జైపాల్, ఎంఈవో నారాయణ, సీడీపీవోలు అరవింద, విజయలక్ష్మి తదితరులున్నారు.
 
విద్యార్థులు, సబ్‌కలెక్టర్‌ మధ్య జరిగిన సంభాషణ ఇలా..
విద్యార్థి: భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్‌ పాఠశాల లకు సరఫరా అవుతుంటే మీరేం చేస్తున్నారు..?
సబ్‌ కలెక్టర్‌: మీ స్కూళ్లకు డ్రగ్స్‌ వస్తే మాకు సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం.  
విద్యార్థి: సమాజం ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తోంది. గ్రామాల్లో చదువుకునే హక్కు కల్పించడంలేదు. దీనికి మీరేం చర్యలు తీసుకుంటున్నారు.?
సబ్‌కలెక్టర్‌: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థినుల కోసం రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. కేజీబీవీలు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దాటవేశారు.
విద్యార్థి: సర్‌.. ఆడపిల్ల అనగానే చిన్నచూపు చూసి కడుపులోనే చంపేస్తున్నారు.?
సబ్‌కలెక్టర్‌: భ్రూణహత్యలకు పాల్పడటం పెద్ద నేరం. అది ఏ ఆస్పత్రో మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం.
విద్యార్థి: మా ఊర్లో చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లకుం డా పనులు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు ?
సబ్‌కలెక్టర్‌ : మీది ఏ ఊరమ్మా..? చిన్నపిల్లల్ని ఎక్కడ పని చేయిస్తున్నారు.? (విద్యార్థిని రాజారాం గ్రామం అని చెప్పగా. వెంటనే జగిత్యాల ఎంఈవో, ఐసీడీఏస్‌ అధికారులను చర్యలకు ఆదేశించారు.)
విద్యార్థి: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. మీరేం చర్యలు తీసుకుంటున్నారు..?
సబ్‌ కలెక్టర్‌: ప్రభుత్వ స్కూళ్లలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. వాటిని వదిలి ప్రైవేట్‌ స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారు.?
విద్యార్థి: సర్‌.. స్వచ్ఛ భారత్‌ అని గొప్పగా చెప్తారు. కానీ మా పాఠశాలలో ఇప్పటి వరకు టాయిలెట్లు లేవు.?
సబ్‌ కలెక్టర్‌: (పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత) అమ్మా.. నువ్వు నా డివిజన్‌ పరిధిలోని వెంకట్రావ్‌పేట స్కూళ్లోనే చదువుతున్నావు. నేను రేపే మీ స్కూలుకు వస్తా. సమస్యను పరిష్కరిస్తా.

మరిన్ని వార్తలు