కోలుకుంటున్న చిన్నారులు

27 May, 2020 11:50 IST|Sakshi
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులు

పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులు కోలుకుంటున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్, సుందరయ్యనగర్‌ కాలనీల్లో సోమవారం పానీపూరి తిన్న చిన్నారులు వాంతులు, విరోచనాలతో రిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. దాదాపు 50మంది చిన్నారులు చికిత్స పొందగా మంగళవారం వీరిలో పలువురు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

ఆదిలాబాద్‌టౌన్‌: పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులు కోలుకుంటున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్, సుందరయ్యనగర్‌ కాలనీల్లో సోమవారం తోపుడు బండిపై ఓ చిరు వ్యాపారి పానీపూరి విక్రయించాడు. వాటిని తిన్న చిన్నారులు వాంతులు, విరోచనాలతో రిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. దాదాపు 50మంది చిన్నారులు చికిత్స పొందగా మంగళవారం వీరిలో పలువురు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరికొంత మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన చిరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పలు సంఘాలు పేర్కొంటున్నాయి.

మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌..
పానీపూరి తిని చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి కారకులైన మున్సిపల్‌ అధికారులు, తదితరులపై చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అచుత్‌రావు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఘటనకు మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రజలు భయాందోళనలు చెందుతున్న సమయంలో నాసిరకం, కలుషిత తినుబండరాళ్లను అనుమతించడంపై అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించాలని, అస్వస్థతకు గురైన చిన్నారులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలని కోరారు.

సీపీఐ నాయకుల పరామర్శ
ఎదులాపురం(ఆదిలాబాద్‌): ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మంగళవారం సీపీఐ జిల్లా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. చిన్నారుల అస్వస్థతకు కారణమైన గుప్‌చుప్‌ వ్యాపారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు, మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీపీఐ నాయకులు అరుణ్‌కుమార్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు