‘సూసైడల్‌ టెండెన్సీ’కి గురవుతున్న చిన్నారులు

10 May, 2019 07:15 IST|Sakshi

విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంబంధాలు

‘ఖరీదైన’ పెంపకాలు ఒక చోట..

భార్యాభర్తల విబేధాలు మరో చోట

పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వైనం

‘సూసైడల్‌ టెండెన్సీ’కి గురవుతున్న చిన్నారులు

సమాజానికి ప్రమాదమంటున్న మానసిక వైద్యులు

‘హౌ టు డై’.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలిక మూడు నెలల క్రితం గూగుల్‌లో శోధించిన ప్రశ్న ఇది. ‘ఐ వాంట్‌ టు డై’ అని కూడా ఆ పాప గూగుల్‌లో ఆత్మహత్యపై సెర్చ్‌ చేసింది. చావు అంటే ఏంటో కూడా తెలియని ఆ పసిప్రాణం ఏకంగా తాను చనిపోవాలనుకొని గూగుల్‌లో వెతకడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. గూగుల్‌లో ఆమె ప్రశ్నలు చూసి తల్లి ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. తనకున్న ఏకైక అనుబంధం ఆ పాపే. కానీ అలాంటి బిడ్డ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందో తెలుసుకోలేకపోయింది. మానసిక నిపుణులను ఆశ్రయించింది. అప్పటికి నాలుగేళ్ల క్రితమే భార్యాభర్తలు విడిపోయారు. ఆ పాప తల్లి దగ్గర ఉంటోంది. మొదట్లో బాగానే చదువుకున్న బాలిక క్రమంగా ఒంటరితనంతో కుంగుబాటుకు గురైంది.. చదువుకు దూరమైంది. తన స్నేహితులంతా అమ్మా,నాన్నలతో ఎంతో సరదాగా, సంతోషంగా ఉంటే తాను మాత్రం ఇంట్లో అమ్మతో మాత్రమే కలిసి ఉండడం, నాన్న ఎందుకు దూరమయ్యాడో తెలియకపోవడం ఆ చిన్నారిని తీవ్ర మనోవేదనకు గురిచేయడంతో పాటు ఆ పసి హృదయాన్ని గాయపర్చాయి. ఈ క్రమంలోనే ‘సూసైడల్‌ టెండెన్సీ’కిగురైంది.

సాక్షి, సిటీబ్యూరో :కారణాలు ఏమైనాగానీ.. భార్యాభర్తల మధ్య చెలరేగుతున్న ఘర్షణలు, మనస్పర్థలు పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తలు విడిపోతున్నారు. ఈ క్రమంలో ఒంటరి తల్లి, తండ్రి వద్ద ఉంటున్న పిల్లలు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. ఒంటరి కుటుంబాల్లో పెరుగుతున్న మరికొందరు పిల్లలు విపరీత ప్రవర్తనకు లోనవుతున్నారు. చిన్న వయసులోనే అలాంటి పిల్లలు చాలామంది మద్యం, సిగరెట్టు, డ్రగ్స్‌ వంటి దురలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. విచ్ఛిన్నమవుతున్న కుటుంబ సంబంధాలు పిల్లల భవిష్యత్‌కు పెనుసవాలుగా మారుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది నాణేనికి ఒక వైపు అయితే.. మరోవైపు పిల్లలు కోరిన వెంటనే కొండమీది కోతినైనా కొని తెచ్చే తల్లిదండ్రుల పెంపకం కూడా పిల్లల పాలిట శాపంగా మారుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఖరీదైన కార్లు, రోజూ వేల రూపాయల పాకెట్‌ మనీ, ఇష్టం వచ్చినట్లుగా తిరిగేందుకు అనుమతినివ్వడం తమ ‘స్థాయి’కి తగిన  ‘విలాసవంతమైన పెంపకంగా భావించే తల్లిదండ్రుల వైఖరి కూడా పిల్లలకు జీవితాలను చీకటిలోకి నెట్టేయడంతో పాటు వారికి ప్రాణాంతకంగా మారుతోంది. బీటెక్‌ చదివి గొప్ప భవిష్యత్‌ను కలలుగంటున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం విషాదాంతంగా మారిన తీరులోనూ ఇలాంటి పెంపకమే కారణమై ఉండడవచ్చని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

భిన్న వైరుధ్యాలు..
స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాల అంచనాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో వివిధ పోలీస్‌స్టేషన్లలో ఏటా నమోదయ్యే వేల కొద్దీ కేసుల్లో 12 శాతం నుంచి 15 శాతం వరకు కుటుంబం సంబంధాలు, భార్యాభర్తల మధ్య స్పర్థలు, వరకట్న వేధింపులు, గృహహింస వంటి అంశాలతోనే ముడిపడి ఉంటున్నాయి. వరకట్న వేధింపుల కారణంగా భార్యాభర్తలు విడిపోతున్నారు. ఆర్థికపరమైన అంశాల్లో విబేధాల కారణంగా ఒకరికి ఒకరు దూరమవుతున్నారు. సుమారు 15 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్న ఓ కుటుంబం ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చింది.  వచ్చిన తర్వాత భర్త కుటుంబం ఆమెపై అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడింది.  దీంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి ప్రస్తుతం  దూరంగా ఉంటున్నారు. 14 ఏళ్ల పెద్దబ్బాయి, 10 ఏళ్లు చిన్న అబ్బాయి ఇద్దరు లండన్‌ చదువులకు దూరమయ్యారు. ‘పిల్లల భవిష్యత్‌ పూర్తిగా ఆగమైంది. ఆయన మద్యానికి బానిసయ్యాడు. ఏం చేయాలో తెలియడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్‌నగర్‌కు చెందిన ఓ 16 ఏళ్ల అబ్బాయి మద్యం, సిగరెట్టుతో పాటు డ్రగ్స్‌కు కూడా అలవాటయ్యాడు. తన కళ్ల ముందే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అతడు ఒంటరివాడయ్యాడు. ‘ఆ కుర్రాడిని మార్చేందుకు ఏడాది పాటు కౌన్సెలింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దురలవాట్లకు దూరమయ్యాడు. కానీ తల్లి, తండ్రి విడిగా ఉండడం మాత్రం అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు’ అని చెప్పారు ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సంహిత. 

డబ్బులిస్తే అన్నీ వచ్చేస్తాయా!
మరోవైపు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అడిగిందల్లా తెచ్చి ఇవ్వడమే పెంపకంగా భావిస్తున్నారు. అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసినట్లుగానే మానవ సంబంధాలను, ఉన్నత చదువులను సైతం కొనుగోలు చేసుకోవచ్చనే విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్‌కు చెందిన ఒక అమ్మాయికి తాము ఉంటున్న ఇల్లు నచ్చలేదు. అదే విషయాన్ని తండ్రికి చెప్పింది. అతడు కూతురు  కోసం ఆరు నెలల్లో మరోచోట మరో ఇల్లు కట్టేశాడు. అడిగిందల్లా తెచ్చి ఇచ్చే ఆ తండ్రి తన కూతురుకు నచ్చిన వ్యక్తిని ‘ఎంత డబ్బయినా సరే తెచ్చి ఇస్తానని’ చెప్పడం గమనార్హం. ఈ తరహా పెంపకం ఆ బాలిక భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అంచనా వేయడం కష్టం. మైనారిటీ తీరని పిల్లలకు ఖరీదైన కార్లు, విలాసవంతమైన వస్తువులు కొని ఇవ్వడం, పబ్బులు, బార్లు రిసార్ట్‌లకు వెళ్లడాన్ని హోదాగా భావించడం పిల్లల పెంపకంలోని వైఫల్యానికి నిదర్శనం. ఇలా పెరిగిన పిల్లలు మద్యం తాగి 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో కార్లలో పరుగులు తీస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు కొందరైతే.. అన్నింటినీ డబ్బుతోనే కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో చివరకు సోమరులుగా మారుతున్న వారు ఇంకొందరు. ఇలాంటివారు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేకపోతున్నారు.   

పిల్లల హక్కులకు రక్షణేదీ?
కుటుంబ సంబంధాల్లోని వైఫల్యాలు, భార్యాభర్తల్లో అవగాహనా రాహిత్యం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. అలాంటి పిల్లలు అన్ని రకాల హక్కులను, అవకాశాలను కోల్పోతున్నారు. ఉత్తమ పౌరులుగా, ఉన్నతమైన వ్యక్తులుగా ఎదిగే హక్కులను కోల్పోతే అది  సమాజం మనుగడకే  ప్రమాదం.  –   అచ్యుతరావు, అధ్యక్షుడు,బాలల హక్కుల సంఘం   

కుటుంబమే పునాది
పిల్లలను స్కూల్‌కు, కాలేజీకి పంపిస్తే అక్కడే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనుకోవడం సరైంది కాదు. వారి ఎదుగుదలకు కుటుంబమే పునాది. అలాంటి కుటుంబమే బలంగా లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఇది ఆ కుటుంబానికి, సమాజానికి కూడా నష్టమే. మా వద్దకు వచ్చే చాలామంది పిల్లల్లో అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్‌ టెండెన్సీతో పాటు కొత్త కొత్త సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి పిల్లలకు ఎంతో ఓపిగ్గా కౌన్సెలింగ్‌ ఇచ్చి తగిన వైద్యం చేస్తేగానీ సాధారణ స్థితికి రావడం లేదు. – డాక్టర్‌ సంహిత, సైకియాట్రిస్ట్‌

>
మరిన్ని వార్తలు