పండులో..విషముండు

6 Sep, 2018 12:00 IST|Sakshi

తాజా పండ్లలో హానికర రసాయనాలు  

చైనా పౌడర్‌తో మగ్గిస్తున్న వైనం

ఎసిటలిన్‌ గ్యాస్, కార్బైడ్‌ కూడా..  

పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్‌ మూలకాలు

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధ్యయనంలో వెల్లడి

సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పీల్చే గాలి, తాగే నీరే కాదు.. ఆకుకూరలు, కూరగాయలతో పాటు నిగనిగలాడుతూ నోరూరించే పండ్లు సైతం విషతుల్యమవుతున్నాయి. మార్కెట్‌కు ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే, వాటిని మగ్గించేందుకు ఇక్కడి వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని ప్రధాన పండ్ల మార్కెట్లు, బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ రకాల పండ్లను చైనా పౌడర్, ఇతరరసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారని, దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ తాజా అధ్యయనంలో గుర్తించింది. కాయలను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రసాన పౌడర్‌తో పాటు ఎసిటలిన్‌ గ్యాస్, కార్బైడ్‌ వంటి పదార్థాలు వాడుతున్నారని తేల్చింది. ఈ పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్‌ వంటి మూలకాల ఆనవాళ్లున్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలున్న పండ్లు తిన్నవారికి మెదడు, నరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, చర్మవ్యాధులు, కడుపులో మంట   వంటి సమస్యలతో బాధపడతారని హెచ్చరించింది.

మోతాదు మించితే ప్రమాదం
మార్కెట్‌లో పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పుడు పలువురు వ్యాపారులు చైనా పౌడర్, ఎసిటలిన్‌ గ్యాస్, ఫాస్పరస్, ఆర్సెనిక్‌ తదితర మూలకాలున్న రసాయనాలను వాడుతున్నారు. పైగా ఆయా రసాయనాలను అతిగా వినియోగిస్తుండడంతో పరిస్థితి చేయిదాటుతోంది. పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఇథిలిన్‌ గ్యాస్‌ను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నారు. పండ్లను మగ్గబెట్టే ఛాంబర్‌లో ఈ గ్యాస్‌ మోతాదు 100 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) యూనిట్లకు మించరాదన్నది ప్రభుత్వ నిబంధన. కానీ చాలామంది వ్యాపారులు ఈ నిబంధనను పాటించడంలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి గ్యాస్‌ను నేరుగా పండ్లకు తగలకుండా పేపర్‌లో చుట్టిన తరవాతనే గ్యాస్‌ను ప్రయోగించాలి. అయితే ఈ నిబంధనకు కూడా చాలామంది వ్యాపారులు నీళ్లొదిలి నేరుగా వాడుతున్నట్టు గుర్తించారు. ఇంకొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కంప్రెస్డ్‌ ఇథిలిన్‌ గ్యాస్, ఇథనాల్, ఇథోపాన్‌ వంటి రసాయనాలను అవసరాన్ని మించి వినియోగిస్తున్నారని, ఇది నేరుగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది.

అమ్మో చైనా పౌడర్‌
హానికారక రసాయనాలు, మూలకాలున్న చైనా పౌడర్‌ను చెన్నై, ముంబై పోర్టుల నుంచి నేరుగా నగరంలో పలువురు దళారులు, వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సంస్థ దాడుల్లో బయటపడింది. ఐపీఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతోన్న వ్యాపారులు గోడౌన్ల బయట కొన్ని పండ్లను నిబంధనల ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గోడౌన్‌ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లను మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. ఈ పండ్లలోనే ప్రమాదకర రసాయన ఆనవాళ్లు అధికంగా ఉంటోందని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తేల్చింది. 

కొనే ముందు పరిశీలించాలి..  
మార్కెట్‌లో కొనుగోలు చేసే పండ్లపై అధిక సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల ఆనవాళ్లున్నట్లు గుర్తించాలి.
యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి పండ్లు బాగా నిగనిగలాడుతుంటే వాటిపై రసాయనాల పూత ఉన్నట్టు.  
పండ్లను తినేముందు బాగా కడిగి తినాలి.
సహజసిద్ధంగా పక్వానికి వచ్చే పండ్లను తింటేనే ఆరోగ్యానికి మంచిదని, ఆయా పండ్లలో ఆవశ్యక పోషకాలుంటాయని గుర్తించాలి.

మరిన్ని వార్తలు