ఏడాదిలోగా క్రైస్తవ భవన్‌

21 Dec, 2016 07:57 IST|Sakshi
ఏడాదిలోగా క్రైస్తవ భవన్‌

- నాగోల్‌ చౌరస్తాలో రెండెకరాలు కేటాయిస్తున్నాం: సీఎం కేసీఆర్‌
- ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
- పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ


సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ భారత దేశానికే గర్వకారణంగా నిలిచేలా హైదరాబాద్‌లో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతేడాది క్రిస్టియన్‌ భవన నిర్మాణానికి ప్రయత్నించగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్నారు. నాగోల్‌ చౌరస్తాలో క్రైస్తవ భవన నిర్మాణం కోసం తక్షణమే రెండెకరాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షణ చేసి ఏడాదిలోగా క్రైస్తవ భవన్‌ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన వారు సుఖంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో చర్చిల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, బిషప్‌ల విన్నపం మేరకు స్థానిక సంస్థల ద్వారానే చర్చిల నిర్మాణానికి అనుమతి మంజూరయ్యేలా ఆదేశాలిస్తానన్నారు. చర్చిల నిర్మాణం కోసం నామమాత్రపు ధరకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాత చర్చిలకు మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్మశాన వాటికలు సహా ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు త్వరలోనే బిషప్‌లతో సమావేశమై వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతానని హామీనిచ్చారు.

బంగారు తెలంగాణ అంటే పది మంది మాత్రమే బాగుపడేది కాదని, అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటేనే అది సార్థకమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్రిస్టియన్లపై దాడులు జరిగితే సహించేది లేదని, ఎక్కడైనా జరిగినట్లు తెలిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు సీఎం దుస్తులను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభను, సామాజిక సేవాతత్పరతను కనబరిచిన ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిషప్‌లు తుమ్మబాల, సాల్మన్, డేనియల్, మాజీ సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్, మైనార్టీ సంక్షేమ విభాగం చైర్మన్‌ ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు