హ్యాపీ క్రిస్మస్‌ 

26 Dec, 2018 03:01 IST|Sakshi

దైవ సందేశం వినిపించిన బిషప్‌ 

మెదక్‌ జోన్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చ్‌ ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్‌ ఏసీ సాలమాన్‌రాజ్‌ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆ«రాధనలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్‌ దైవ సందేశం వినిపించారు. మానవుల పాపాలను కడిగేసేందుకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రారాజు ఏసయ్య అన్నారు. అనంతరం ప్రెస్బిటరీ ఇన్‌చార్జి ఆండ్రోస్‌ ప్రేమ్‌ సుకుమార్‌ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వమంతా నిండి ఉన్న దేవుడు ఏసయ్య అని కొనియాడారు. భక్తులు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  

ప్రార్థనల్లో పాల్గొన్న ప్రముఖులు... 
స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉపేందర్‌రెడ్డిలు చర్చ్‌ ప్రాంగణంలో కేక్‌ కట్‌ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా మెదక్‌ సీఎస్‌ఐ చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏసుక్రీస్తు బోధించిన పరలోక మార్గం సూత్రాలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు.  

భారతీ సిమెంట్‌ ఆధ్వర్యంలో పాల వితరణ: క్రిస్మస్‌ పండుగ సందర్భంగా మెదక్‌ సీఎస్‌ఐ చర్చ్‌ ప్రాంగణంలో భారతీ సిమెంట్‌ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సుమారు 10 వేల లీటర్ల పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్‌ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండల్‌రెడ్డి, సతీష్‌కుమార్, గంగాధర్, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి భారతీ సిమెంట్‌ మెదక్‌ డీలర్‌ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు