కేంద్రం నియంత పాలన

26 Feb, 2020 03:27 IST|Sakshi
ధర్నాలో మాట్లాడుతున్న చుక్కా రామయ్య. చిత్రంలో హరగోపాల్‌ తదితరులు

ప్రజల పక్షాన గొంతు విప్పితే జైల్లో పెడుతున్నారు: చుక్కా రామయ్య

ప్రజా సంఘాల నేతల అరెస్టులను ఖండిస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా

కవాడిగూడ: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్రం నియంత పాలన కొనసాగిస్తోందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. ప్రజల పక్షాన గొంతువిప్పుతున్న ఉద్యమకారులను అర్బన్‌ నక్సలైట్‌ పేరుతో జైళ్లలో పెడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలపై నిర్బంధాన్ని, అక్రమ కేసులను, అక్రమ అరెస్టులను ఖండిద్దాం.. ఉపా చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిర్బంధ వ్యతిరేక వేదిక–తెలం గాణ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా అరెస్టు చేసిన 17 మంది ప్రజా ఉద్యమకారుల కుటుంబ సభ్యులను సభకు పరిచయం చేశారు. ప్రొ.హరగోపాల్‌ అధ్యక్షతన ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తాను స్వాతంత్య్ర, సాయుధ, తెలంగాణ పోరాటం లో పాల్గొన్నానని ఏనాడూ అర్బన్‌ నక్సలైట్‌ అనే పదం వినలేదన్నారు.

ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర చేశారని విరసం నేత వరవరరావును అరెస్టు చేసి జైల్లో పెట్టారని, తనకు తెలిసి ఆ కుటుంబంలో ప్రతి బిడ్డా దేశభక్తుడేనని అన్నారు. అచ్చోసిన ఆంబోతులుగా ట్రంప్, మోదీ పదే పదే కౌగిలించుకుంటున్నారని.. ఇది ఒక అసాంఘిక లైంగిక చర్య అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా.. అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రొ.హరగోపాల్‌ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావవ్యక్తీకరణ కల్పించిందని, ఈ హక్కుతో ప్రతి ఒక్కరికీ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటం నేరం కాదని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొ.కోదండరాం చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎవరైనా గొంతువిప్పితే నేరం, దేశద్రోహులంటూ జైల్లో పెడుతున్నారని అన్నారు. దేశం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నదే లేదని, నలుగురు కూర్చొని మాట్లాడితే 144 సెక్షన్‌ అమలు చేస్తున్న పరిస్థితి ఉందని ప్రొ.విశ్వేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, రమ, సీపీఎం రాములు, వేదిక సమన్వయకర్తలు రవిచందర్, లక్ష్మణ్, చెరుకు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు