స్కూలు పిల్లలతో పైరసీ!

21 Dec, 2017 02:50 IST|Sakshi
బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో సమావేశమైన నిర్మాత దిల్‌ రాజు, హీరో అల్లు శిరీష్‌

రూ.500, రూ.1000 ఇస్తూ  ప్రోత్సహిస్తున్న పైరసీకారులు 

నిరోధానికి సహకరించాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు విజ్ఞప్తి 

 సీసీఎస్‌ డీసీపీని కలసిన తెలుగు సినీ రంగ ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌: సినీ పైరసీ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలను వివిధ మార్గాల్లో రికార్డు చేసే ఈ ముఠాలు స్కూలు విద్యార్థులను వాడుకుంటున్నట్లు వెల్లడైంది. కొన్నాళ్లుగా తమ దృష్టికి వచ్చిన 7 కేసుల్ని అధ్యయనం చేసి ఈ విషయం గుర్తించామని నిర్మాత దిల్‌ రాజు పేర్కొన్నారు. ఆయనతో పాటు సినీ హీరో అల్లు శిరీష్‌ తదితరులు బుధవారం సీసీఎస్‌ డీసీపీ అవినాశ్‌ మహంతి, సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలిశారు. పైరసీతో సినీరంగానికి చెంది న వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, దీన్ని నిరోధించడానికి పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరారు. దిల్‌ రాజు మాట్లాడుతూ... ‘స్కూలు, కాలేజీ పిల్లలకు పైరసీ ముఠాలు ఎరవేస్తున్నాయి.

చిత్రం విడుదల రోజు మార్నింగ్‌ షో చూడాల్సింది గా వారికి చెప్పి ఆ సినిమాను సెల్‌ఫోన్‌ లేదా కెమెరాలో రికార్డు చేస్తే రూ.500 నుంచి రూ.1000 ఇస్తామంటూ వాడుకుంటున్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ చెప్పడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో కలసి ఫిల్మ్‌ చాంబర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పైరసీకి వ్యతిరేకంగా లఘుచిత్రాలు రూపొందించి థియేటర్లలో ప్రదర్శించనున్నాం. భారీస్థాయిలో కరపత్రా లు, పోస్టర్లు సైతం వేస్తాం. థియేటర్‌లో ఎవరైనా పైరసీ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన వారికి చాంబ ర్‌ తరఫున నగదు పారితోషికం ఇవ్వనున్నాం’ అని అన్నారు. సినీ హీరో అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. ‘తెలిసీ తెలియని వయసులో పైరసీ ముఠాల వలలో పడి విద్యార్థులు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. సినిమా రంగం దెబ్బతినడం అంటే నిర్మాతలు, హీరో హీరోయిన్లు మాత్రమే కాదు. దీనిపై ఆధారపడిన కిందిస్థాయి వర్గాలు అనేకం ఉన్నాయి’అని వివరించారు.  

పీడీ యాక్ట్‌కు యోచన..
వారం క్రితం ఫిల్మ్‌ చాంబర్‌ సినీ రంగ ప్రముఖులతో భేటీ అయ్యాం. ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. పైరసీపై పోరాటానికి ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. పోలీసు విభాగం సిఫార్సు ఆధారంగా వీరు ఆయా వెబ్‌సైట్స్‌ బ్లాక్‌ చేయడం తదితర చర్యలు తీసుకుంటారు. పదేపదే పైరసీ చేస్తూ చిక్కేవారిపై పీడీ యాక్ట్‌ నమోదుకు ఆస్కారం ఇవ్వాలంటూ జయేశ్‌ రంజన్‌ను కోరాం. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. పైరసీకి చెక్‌ చెప్పడానికి ఇంటర్‌నెట్, సర్వీసు ప్రొవైడర్ల సహకారం కూడా తీసు కోనున్నాం’.          – కేసీఎస్‌ రఘువీర్, అదనపు డీసీపీ  

మరిన్ని వార్తలు