కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్‌

29 Nov, 2018 09:49 IST|Sakshi
చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న సినీ నటి విజయశాంతి

తెలంగాణ వచ్చినా అభివృద్ధి ఏదీ.. 

సోనియాను విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదు 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే అందరికి న్యాయం 

కాంగ్రెస్‌ నాయకురాలు, సినీనటి విజయశాంతి 

సాక్షి, చేవెళ్ల:  ‘దొరా.. కేసీఆర్‌.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని  అనుకున్నాం కానీ, ఏమి చేయాలేదు’ అని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో బుధవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేఎస్‌ రత్నం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తావని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దళితబిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా... గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్‌ అడిగారన్నారు.

ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి.. లోపల తననే ముఖ్యమంత్రి చేయమని అడగటంపై సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో సోనియా.. దళితబిడ్డనే ముఖ్యమంత్రిని చేయాలి నేను మిమల్ని ముఖ్యమంత్రి చేయను, నీవు నా పార్టీలో చేరవద్దు అని పంపించారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, అలాంటి దేవతను విమర్శించే హక్కు, స్థాయి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, కవితకు లేదన్నారు. ఇంటింటికో ఉద్యోగం, దళితులకు భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అన్ని ఇచ్చి హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదించాలని  సభలు పెడుతున్నారని, మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి  వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపీ, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తుందని,  ఏడాదికి పేదలకు ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా  ఇస్తుందన్నారు. 5లక్షల వరకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు.  

 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేఎస్‌ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని  కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే  ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అనుకున్నామని, జిల్లాకు  ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రాలేదన్నారు.

అప్పుడు ఓట్లు కోసం వచ్చాడు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తాడని విమర్శించారు.  ఈ ప్రాంతానికి ప్రాణహితను అడ్డుకున్నాడు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దానిని పాలమూరు ఎత్తిపోతల అని మార్చాడన్నారు.ఆ నీళ్లు వస్తాయో రావో తెలియదన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు.  తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ..  తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కేస్‌ రత్నంను అప్పుడు కొన్ని దుష్టశక్తులు కలిసి ఓడించాయని, ఈసారి భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ సభలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పి.వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్‌ రత్నం, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి, డైరెక్టర్‌ అగిరెడ్డి, మహిళా నాయకురాలు సదాలక్ష్మీ, నాయకులు  గోపాల్‌రెడ్డి, వెంకటేశంగుప్తా,  వసంతం, మధుసూదన్‌గుప్తా, రవికాంత్‌రెడ్డి,  శర్వలింగం, శ్రీనివాస్‌గౌడ్,  టేకులపల్లి శ్రీను, శ్రీదర్‌రెడ్డి,  కె.రామస్వామి,  వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, రఘువీర్‌రెడ్డి,  విఠలయ్య, శివానందం, ప్రకాశ్‌గౌడ్, శంకర్, ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు