థర్డ్‌ పార్టీ చెక్‌చేస్తోంది.. జాగ్రత్త!

29 Jun, 2018 02:27 IST|Sakshi

జిల్లా పోలీసింగ్‌పై సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌

నగర కమిషనరేట్‌లో విజయవంతం జిల్లాల్లో అమల్లోకి...

 స్టేషన్ల వారీగా నాలుగు అంశాలపై ఫీడ్‌ బ్యాక్‌  

దీని ఆధారంగా అధికారులు, సిబ్బంది పనితీరుపై నజర్‌

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుల పనితీరు, స్టేషన్లలో బాధితులతో వ్యవహరిస్తున్న తీరుపై థర్డ్‌ పార్టీ ఫీడ్‌ బ్యాక్‌ అందిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ముందస్తుగా హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రారంభించిన సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ వ్యవస్థ విజయవంతం అయ్యింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పుడు ఈ వ్యవస్థను జిల్లాల్లోనూ అమలు చేస్తున్నారు. ప్రతీ నెలా అన్ని జిల్లాలు, నూతన కమిషనరేట్ల పరిధిలో పోలీసుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
 
ప్రధానంగా నాలుగు అంశాలపై...

మారుమూల స్టేషన్‌ నుంచి జిల్లా కేంద్రాల్లో ఉన్న ఠాణాల వరకు ప్రతీచోట ఏం జరుగుతోంది? ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులతో సిబ్బంది, అధికారులు ప్రవర్తించే తీరు ఎలా ఉంటోంది? రిసెప్షన్‌ సెంటర్‌లో ఉన్న అధికారులు, సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు? సంఘటనా స్థలికి పెట్రోలింగ్, బ్లూకోట్స్‌ సిబ్బంది ఎంత సమయంలో వస్తున్నారు? పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ సమయంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది ఎలా పని చేస్తోంది? మర్యాదపూర్వకంగా ఉందా? లేకా డబ్బులు ఏమైనా డిమాండ్‌ చేస్తున్నారా.. ఇలా ప్రధానంగా నాలుగు అంశాలతో థర్డ్‌ పార్టీతో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు.

ప్రతీ ఫిర్యాదుదారుడికి థర్డ్‌ పార్టీ నుంచి ఫోన్‌కాల్‌ వెళ్తుంది.. స్టేషన్‌లో అధికారి, సిబ్బంది వ్యవహరించిన తీరుపై 1 నుంచి 10 వరకు గ్రేడింగ్‌ ఇస్తారు. ఇలా నాలుగు అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నారు. ప్రతీ నెలా ఈ ఫీడ్‌ బ్యాక్‌ రిపోర్ట్‌ జోన్ల ఐజీలకు అందుతోంది.  

గ్రేడింగ్‌ వారీగా...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600కి పైగా పోలీస్‌స్టేషన్ల నుంచి వచ్చే నివేదికలను ఐజీలు పరిశీలించి థర్డ్‌ పార్టీ ఫీడ్‌ బ్యాక్‌ నుంచి వచ్చిన మార్కుల ఆధారంగా ఆ ఠాణా అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జోనల్, జిల్లా మీటింగ్‌ల్లో సంబంధిత స్టేషన్, అధికారి, సిబ్బందికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. అలాగే పనితీరు సరిగా లేని ఠాణా, సర్కిల్, డివిజన్ల అధికారులతో చర్చించి పనితీరు మార్చుకునేలా ఐజీలు, సంబంధిత ఎస్పీ/కమిషనర్లు కృషిచేస్తున్నారు.

ఏకరూప పోలీసింగ్‌లో ఇది కీలకమని, ప్రతీ చోటా పోలీస్‌ సేవలు పారదర్శకంగా, అంకితభావంతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు మంచిపేరు తెచ్చేలా సిబ్బందిని, అధికారులను ప్రోత్సహించేందుకు ఈ సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ వ్యవస్థను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు